ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మరోసారి విజయకేతనం ఎగరేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర సీఎంగా వరుసగా రెండోసారి నాయబ్ సింగ్ సైనీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.కాగా, ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 90 స్థానాలకు గాను 48 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో మరోసారి సభ్యులంతా నాయబ్ సింగ్ సైనీ వైపే మొగ్గు చూపారు. మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్... నాయబ్ సింగ్ పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దాంతో ఈరోజు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది