‘వారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు మరి. వారితో సమస్య లేకుండా కాస్త చూసుకోండి. లేకుంటే మేమేమీ చేయలేం. ఆతర్వాత మీ ఇష్టం’.. ఇలా మద్యం వ్యాపారులకు కొందరు అధికారులు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మద్యం దుకాణాలు విజయవంతంగా.. ఆరు ఫుల్లు.. మూడు ఆఫ్‌లుగా విక్రయాలు జరగాలంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం జరగాల్సిఉంది. ప్రతి మండలంలో.. నియోజకవర్గంలో బాస్ ఎమ్మెల్యేనే. పైకి ఎమ్మెల్యే ప్రమేయం లేకున్నా.. చాన్నాళ్ల నుంచి వైన్ షాపుల నుంచి వచ్చే లాభంలో పార్టీలతో సంబంధం లేకుండా ఆ ఎమ్మెల్యేలకు కొంత వాటాను అప్పగిస్తుంటారు.
ఇది అనధికారిక రూల్. ఇప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు కావడంతో.. మరలా బెల్ట్ దుకాణాలు కొలువు తీరుతాయి. అలానే ఎమ్మార్పీ పెంచుకోవడం, ఆపై దుకాణాల్లో వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు విక్రయాలు.. మందుబాబులు తాగేందుకు ఏర్పాట్లు చేపట్టడం వల్ల అదనపు ఆదాయం చేకూరుతుంది. ఇలా వచ్చిన లాభంలో ఎమ్మెల్యేలకు.. ఇతర కీలక ప్రజాప్రతినిధులకు పంపకం చేయాల్సిందే. దీనిపై ఎక్జైజ్ అధికారుల్లో చర్చ జరిగినట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా.. పైఅధికారులకు ఫిర్యాదు అందకుండా.. రెండేళ్ల పాటు వివాదాలు లేకుండా సాఫీగా వ్యాపారం జరగాలంటే ముందుగా నియోజకవర్గ ఎమ్మెల్యేను వెళ్లి కలవాలని.. వారి ఆశీస్సులు ఉన్నాయన్న నమ్మకాన్ని కల్పించుకోవాలని వ్యాపారులకు వారు సూచించినట్లు సమాచారం. ఇప్పటికే సిండికేట్ అయి మద్యం దుకాణాలను దక్కించుకున్న వాళ్లందరూ రాజకీయ పార్టీల ప్రధాన అనుచరులే. ఇటు ఎక్సైజ్ అధికారులకు వ్యాపారులే భరోసా ఇస్తూ ఎమ్మెల్యేలనుంచి.. ఎటువంటి సమస్యా ఉండదని.. అవన్నీ తాము చూసుకుంటామని జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులతో మద్యం వ్యాపారం కోసం ఇబ్బంది కలుగకుండా ఆ బాధ్యతలు ముందుగానే సరిదిద్దు కోవాల్సిందేనంటూ అనధికారిక హెచ్చరికలను అధికారులు జారీచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.