భావనపాడు(మూలపేట) గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం ఏడాదిలోగా పూర్తిచేస్తామని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దీంతో కూటమి ప్రభుత్వ పనితీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం పోర్టు పనులకు సంబంధించి ఏప్రిల్ 19, 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి శ్రీ విశ్వసముద్ర సంస్థ రూ.4361.91 కోట్లతో టెండర్లు దక్కించుకుంది. ఈ పోర్టు నిర్మాణం 2026 నాటికి పూర్తిస్థాయిలో జరిగితే నాలుగు బెర్త్‌లకు గాను రెండు బెర్త్‌లు జనరల్(కార్గో), ఒక బెర్త్ బొగ్గుకు, ఇంకో బెర్త్ కంటైనర్లకు ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా 10.6 కిలోమీటర్ల రైలుమార్గం అవసరమని, 13.8 కిలోమీటర్ల రోడ్డు మార్గం అవసరమని, పోర్టు నిర్మాణానికి 826.51 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు.
అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయించారు. 293.97 ఎకరాల సాల్టు భూముల సమస్య ఇప్పటికీ కొలిక్కిరాలేదు. చెన్నైకి చెందిన సాల్ట్ కమిషనర్ జిల్లా కలెక్టర్‌తో పలుమార్లు ఉప్పు భూముల సమస్యపై కూర్చున్నా రేటు తేలకపోవడంతో ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాలేదు. పోర్టు రైలు మార్గానికి సంబంధించి పోతునాయుడుపేట, యామాలపేట, రాజపురం, కాశీపురం, కోటపాడు, కూర్మన్నపేట గ్రామాలకు చెందిన 142 మంది రైతులకు సంబంధించి 72 ఎకరాల భూమి అవార్డు స్టేజ్‌లోనే మగ్గుతోంది. ఇక మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించి సుమారు 40మంది లబ్ధిదారులకు పీడీఎఫ్‌లు సైతం అందని పరిస్థితి నెలకొంది. ఇక పోర్టు పనులకు సంబంధించి నార్త్‌బ్రేక్ గట్టు 271 మీటర్లు పూర్తిచేయగా సౌత్‌బ్రేక్ గట్టు 1,940 మీటర్లకు గాను అసంపూర్తిగా నిలిచిపోయింది. సౌత్‌బ్రేక్ గట్టుపై వేసిన ఇసుక ఇటీవల కాలంలో ఏర్పడిన తుఫాన్‌కు కొట్టుకుపోయింది. ఇక పోర్టు పరిధిలో 15.85 మిలియన్ క్యూబిక్‌మీటర్ల ట్రెజ్జింగ్ పనులు జరగాల్సి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో జరగలేదు. అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ ట్రెజ్జింగ్ పనులు జరుగుతున్నపుడు ఫొటోల ఫోజులు ఇచ్చారు. 2024 జూన్4 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ విశ్వసముద్ర సంస్థ చేపట్టిన పనులు మినహా ఇటీవల ఏ పనులూ జరగలేదు. టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన కింజరాపు అచ్చెన్నాయుడు జూన్ 4న పోర్టు పనులు ఆపివేయాలని ప్రకటించగా ఈ నాటి వరకు అవి మూలకు చేరాయి. అయితే ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మూలపేటలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహ్మద్‌ఖాన్‌లతో కలిసి సమావేశం ఏర్పాటుచేసి పోర్టు పనులకు శ్రీకారం చుడతామని చెప్పడం, దరిమిలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ పనులు ఏడాదిలోగా పూర్తిచేస్తామని ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.