పాడిరైతులకు విశాఖ డెయిరీ ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇస్తున్న ఆవుపాల ధరకు లీటరుకు 2 రూపాయల 30పైసలు తగ్గించింది. దీంతో విశాఖ డెయిరీకి పాలు ఇస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, హరిపురం, టెక్కలి, పాతపట్నం, సారవకోట, నరసన్నపేట, గార, శ్రీకాకుళం, పైడిభీమవరం, బుడుమూరు, సరుబుజ్జిలి, కొత్తూరు తదితర ప్రాంతాల్లో విశాఖ డెయిర్ బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో క్షేత్రస్థాయిలో పాలసేకరణ ఏజెంట్ల ద్వారా రోజూ ఉదయం 8గంటల లోపు, సాయంత్రం 8గంటల లోపు పాలను సేకరిస్తుంటారు. అయితే జిల్లాలో రోజుకు సుమారు లక్షా40వేల లీటర్ల పాలు సేకరణ చేస్తుండగా, ఇందులో అధికశాతం ఆవుపాలే. క్షేత్రస్థాయిలో ఏజెంట్ల వద్ద సేకరించిన పాలను క్యాన్లతో సమీపంలోని బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లకు పంపించడం, ఆవుపాలల్లో వెన్నశాతం బాగుంటే లీటరుకు 42 రూపాయల మేరకు, గేదెపాలు లీటరుకు 82 రూపాయల వరకు పాడిరైతులకు విశాఖ డెయిరీ చెల్లిస్తుంటుంది.
ప్రస్తుతం విశాఖ డెయిరీలో తయారవుతున్న పాలపౌడర్‌లో రూ.20కోట్లు వరకు నష్టం వాటిల్లుతోందన్న కారణం చూపి ఆవుపాలు ఇచ్చే రైతులకు తగ్గింంచారు. ఈమేరకు మండలస్థాయిలోని మిల్క్ కూలింగ్‌సెంటర్ల మేనేజర్లకు విశాఖ డెయిరీ సమాచారం అందించింది. అయితే జిల్లాలో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో సేకరిస్తున్న లక్షా40వేల లీటర్ల పాలకు సంబంధించి వందలాదిమంది పాడిరైతులకు రూ.3లక్షల22వేలు ఒక రోజుకు నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో విశాఖ డెయిరీకి ప్రత్యామ్నాయంగా హెరిటేజ్ సంస్థ రోజుకు సుమారు 35వేల లీటర్ల పాలను సేకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో విశాఖ డెయిరీని నమ్ముకున్న పాడిరైతులు ఇక హెరిటేజ్‌కు క్యూ కట్టే పరిస్థితి ఉంది. పాల ధర తగ్గింపు అంశమై విశాఖ డెయిరీ ఉద్యోగులకు సంప్రదించేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా సమాచారం ఇచ్చేందుకు దోబూచులాడారు. చివరకు టెక్కలి విశాఖ డెయిరీ మేనేజర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఒక లీటరు ఆవుపాలపై 2రూపాయల30పైసలు తగ్గనుందని, గేదెపాలకు లీటరుకు రూ.3 పెరగనుందని, ఇది డెయిరీ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయమని తెలిపారు.