ఇసుక అక్రమాలపై శ్రీకాకుళం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడన్న వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం నగర వాసులను హడలెత్తించింది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గత ఎన్నికల్లో ఆమదాలవలస స్వతంత్య్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయిన సనపల సురేష్‌పై బుధవారం సుమారు 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి కారు అద్దాలు బద్దలు కొట్టి, దాడికి పాల్పడ్డారు. మంగళవారం దూసి, రాగోలు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు చేసి తరలిస్తున్నారని సనపల సురేష్ జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఇసుక అక్రమ నిల్వలను సీజ్ చేశారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేసిన సనపల సురేష్ బుధవారం తన కారులో చీమలవలసకు చెందిన సనపల చంద్రతో కలిసి రాగోలు జెమ్స్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ మీడియా ప్రతినిధులకు జరిగిన విషయాన్ని వివరిస్తుండగా అలమాజీపేటకు చెందిన అశోక్, పురుషక్షత్తపురం సాయి సహా 30 మంది దాకా అక్కడకు వచ్చి దాడికి యత్నించారు. ఇది గమనించిన సురేష్ తన కారులో అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో కారు వెనుక ఉన్న కొంత మందిని గుద్దు కుంటూ తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు కారులో రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్దామనుకున్న సురేష్‌ను.. అప్పటికే అశోక్, సాయి అడ్డగించడంతో శ్రీకాకుళంలోని ఎస్పీని కలిసేందుకు నగరంలోకి కారు మళ్ళించాడు. అయితే బలగ సమీపంలో సురేష్ తన కారుకు అడ్డంగా బైక్ పెట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేయగా కొంతమంది వ్యక్తులు వచ్చి కారు అద్దాలు బద్దలు కొట్టి దాడి చేశారు. సురేష్ మళ్లీ తప్పించుకుని కాంప్లెక్స్ సమీపంలోకి రాగానే దుండగులు వచ్చి కారులో ఉన్న సురేష్‌ను బయటకు లాగి పక్కనే ఉన్న కాలువలో పడేసి దాడి చేశారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ గోవిందరావు సురేష్‌ను కాపాడి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లాడు. పోలీసులు సురేష్‌ను రిమ్స్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.