సార్వత్రిక సమరం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా వజ్రపుకొత్తూరు మండలంలోని పాతటెక్కలిలో ఇంకా ఎన్నికల వేడి తగ్గడం లేదు. గ్రామంలో ఎక్కడో చోట రాజకీయ తగదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకోవడంతో ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ముగడ గిరి అనే వ్యక్తి గతంలో వైసీపీ సానుభూతి పరుడిగా ఉండేవాడు. స్థానిక నాయకులు తీరు నచ్చక సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి చురుకుగా పని చేశాడు. ఇది నచ్చని తన సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు గిరి ఎప్పుడు కలసినా కవ్వింపు చర్యలకు దిగేవారు.
దీంతో తరచూ ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి గిరి తండ్రి గంగయ్య అమ్మవారి గుడి నుంచి పత్రి కొమ్మలు తీసుకువస్తుండగా దారిలో వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయన్ను అడ్డుకున్నారు. ‘నీ కొడుకు టీడీపీలోకి వెళ్లి ఏమి సాధించాడని’ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. దీనికి గంగయ్య సైతం ధీటుగా బదులు ఇవ్వగా అక్కడే ఉన్న వైసీపీ సానుభూతి పరుడు ముద్దాడ దానయ్య.. గంగయ్య ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో ముందు పళ్లు ఊడిపోయాయి. విషయం తెలుసుకున్న గంగయ్య కుమారుడు గిరి, భార్య మోరియమ్మ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో గంగయ్య, గిరి, మోరియమ్మకు గాయాలయ్యాయి. గంగయ్య పారతో తనపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైందని వైసీపీకి చెందిన దానయ్య చెబుతున్నాడు. మరో మహిళకు స్వల్పగాయాలయ్యాయి. ఇరువర్గాలకు చెందిన క్షతగాత్రులు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ నిహాల్ తెలిపారు. కాగా, వీరంతా ఒకే సామాజిక వర్గంతో పాటు బంధువులు కావడం విశేషం.