ఒంటరిగా వెళ్తున్న మహిళలే వారి టార్గెట్. బైక్‌లో వారిని అనుసరించి మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లడం వీరి పని. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఎన్నో ఘటనలకు పాల్పడినా.. జిల్లాలో తొలిసారి చేతివాటం ప్రదర్శించిన అంతర్రాష్ట్ర ముఠాలో ఒకరు పోలీసులకు దొరికి పోయాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 1వ తేదీన వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ, బారువ, కంచిలి ప్రాంతాల్లో ఒకే రోజు నలుగురు వ్యక్తులు చైన్ స్నాచింగ్‌కు పాల్పపడ్డారు.
వీరిలో ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రం జైపూర్ జిల్లా ముండమల్ గ్రామానికి చెందిన చిన్మయ ప్రధాన్. పోలీసులు ఇతడ్ని పట్టుకుని ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కంచిలి మండలం మకరాంపురం జంక్షన్ సమీపంలో సుజలా వాటర్ ప్రాజెక్టు వద్ద స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళల్లో వెనుక కూర్చున్న మహిళ మెడలో బంగారు పుస్తుల తాడును నిందితులు చిన్మయి ప్రధాన్, బిజయ్ ప్రధాన్‌లు లాక్కెళ్లారు. అదేరోజు బారువ మండలం కొర్లాం గ్రామ సమీపంలో ఓ మహిళ మెడలో పుస్తెల తాడును, అదే రోజు వజ్రపు కొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ఈ చోరీలకు పాల్పడిన వెంటనే వారి వెనుక వస్తున్న సంతోష్ ప్రధాన్ సంజయ్ ప్రధాన్‌కు దొంగిలించిన బంగారు వస్తువులను ఇచ్చేసి వారి నుంచి దుస్తులు తీసుకుని మార్చుకున్నారు. ఆ తరువాత బంగారు వస్తువులు జాడుపూడి కోలనీ జంక్షన్ దగ్గరిలో బోలా శంకర్ దాబా వెనుక ప్రధాన నిందితుడు చిన్మయి ప్రధాన్ ఒక్కడే వెళ్లి గొయ్యి తీసి దాచిపెట్టాడు. ఈ నెల 15న దాచిపెట్టిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లేందుకు వచ్చిన చిన్మయి ప్రధాన్ తిరిగి వెళ్తుండగా కంచిలి పోలీసులకు పట్టుబడ్డారు. చిన్మయి ప్రధాన్ 2020లో కోల్‌కత్తాలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది ఫిభ్రవరిలో విడుదలై స్వగ్రామానికి చేరుకున్నారన్నాడు. తన తల్లి అనారోగ్యానికి చికిత్స నిమిత్తం డబ్బులు అవసరం కావడంతో ఆదే గ్రామానికి చెందిన సంతోష్ ప్రధాన్‌తో ఒంటరి మహిళల మెడ నుంచి బంగారు ఆభరణాలు దొంగతనానికి పథకం వేశారని, వీరికి బిజయ్ ప్రధాన్, సంజయ్ ప్రధాన్ సహకారం అందించడంతో దొంగతనాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. గతంలో వీరిపై ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ర్టాల్లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా నేరాలకు పాల్పడినట్లు చెప్పారు. నలుగురు నిందితుల్లో చిన్మయి ప్రధాన్‌ను అరెస్ట్ చేయగా మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కాశీబుగ్గలో జరిగిన చోరికి సంబందించి సొత్తును రికవరీ చేయాల్సి ఉందన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన క్రైం ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ రూరల్ సీఐ ఈశ్వరరావు, సోంపేట సీఐ బి. మంగరాజు, కంచిలి ఎస్‌ఐ జి.రాజేష్, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ నిహార్, హెచ్‌సీ గవరయ్య, పీసీలు బషీర్, నీలకంఠం, రాధాకృష్ణ, శ్యామ్, షణ్ముక, ప్రేమ్‌కుమార్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.