విశాఖ శారదా పీఠానికి జగన్ సర్కారు హయాంలో జరిగిన భూ కేటాయింపు ‘రద్దు’పై జరుగుతున్న తాత్సారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. భూకేటాయింపు రద్దు చేయాలంటూ రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన ఫైలును తిరిగి తెప్పించుకోవాలని సీఎస్ కార్యాలయాన్ని ఆదేశించారు. జగన్ సర్కారు శారదా పీఠానికి కారు చౌకగా భూమి కేటాయించిన వైనం... దానిని రద్దు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా సదరు ఫైలును వెనక్కి పంపించిన తీరుపై ‘సాములోరికే ఎరుక!’’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వార్త అధికార వర్గాల్లో కలకలం రేపింది. స్వయంగా సీఎం ఆదేశంతో కదిలిన ఫైలును ఎవరు వెనక్కి పంపించారు? అంతటి దుస్సాహసం చేసిన వారెవరనే చర్చ ఇటు ప్రభుత్వంలో, అటు టీడీపీలో జోరుగా సాగింది. సోషల్ మీడియాలో చర్చోపచర్చలు సాగాయి.
ఈ వార్తపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ‘‘శారదా పీఠం ఫైలు ఎందుకు వెనక్కి పంపించారు? అసలు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? వార్తలోని అంశాలు నిజమేనా?’’ అంటూ తన కార్యాలయం అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ‘ఆంధ్రజ్యోతి’ వార్తలో ప్రస్తావించిన అంశాలు 100 శాతం నిజాలేనని సీఎంవో అధికారులు నివేదించినట్లు తెలిసింది. ‘‘సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ శారదా పీఠం భూ కేటాయింపులపై సకాలంలో అధ్యయనం చేసింది. భూ కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగింది. రూ.225 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.15 లక్షలకే కేటాయించారు. పైగా... ఆధ్యాత్మిక అవసరాలకు కాకుండా, ఆదాయార్జనకు అనుమతించారని ఆ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో భూ కేటాయింపు ఉత్తర్వులను రద్దుచేయాలని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి పంపించింది. అక్కడే ఫైలు పెండింగ్‌లో ఉంది. ఇటీవలే పలు కారణాలను చూపించి ఫైలు వెనక్కి పంపించారు’’ అని సీఎంవో అధికారులు నివేదించినట్లు తెలిసింది. ఫైలును ఎలా వెనక్కి పంపిస్తారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా సీఎం మాట్లాడినట్లు తెలిసింది. భూ కేటాయింపు రద్దు ప్రతిపాదన అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.