ఈ అనంత సృష్టిలో నిత్యం ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మన దృష్టికి వస్తే.. మనకు తెలియని వింతలు ఎన్నో. ప్రతి అద్భుతం వెనుక ఓ కారణం ఉంటుంది. కొంతమంది దానిని దేవుడు అంటే.. మరికొంత మంది దానిని సైన్స్ అంటుంటారు. కారణమేదైనా.. మనకు తెలియని ఓ అద్భుత శక్తి మనల్ని నడిపిస్తోందనేది కాదనలేని వాస్తవం. అలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దేవాలయం వద్దనున్న కోనేరు నీటిలో వరద నీరు కలవకపోవటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా చెప్పిన విధంగానే కొంతమంది దీనిని సైన్స్ అంటుంటే.. మరికొందరు మాత్రం దేవుడి మహిమ అంటున్నారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో రామేశ్వరం ఆలయం ఉంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ దేవాలయం ఆవరణలో ఉన్న కోనేరు వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైందని వీడియో వైరల్ అవుతోంది. పై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ.. కోనేటిలోని నీటితో వరద నీరు కలవడం లేదంటూ వీడియోలో ఉంది. కోనేటిలో నీరు నిండుగా ఉన్నప్పటికీ.. పై నుంచి వస్తున్న వరద నీరు అందులో కలవకుండా ఉండటం విశేషం. దీంతో ఇదంతా దేవుడి మహిమంటూ.. ఈ వీడియోను నెటిజనం షేర్ చేస్తున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే.. ఇది ఇప్పటి వీడియో కాదని తెలిసింది. నాలుగేళ్ల కిందట జరిగిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. 2020 అక్టోబర్‌లో ఈ వీడియో మీడియాలో ప్రసారం అయ్యింది. అదే వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
ఇక ఈ ఆలయ విశేషాలకు వస్తే. కాల్వబుగ్గలో రామేశ్వర స్వామిని పరశురాముడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అలాగే భూమి నుంచి నీరు బుగ్గలా ఉబికివచ్చి కాలువలా ప్రవహిస్తూ ఉండటంతో ఈ ప్రాంతానికి కాల్వబుగ్గ అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. మరోవైపు కాల్వబుగ్గ రామేశ్వర ఆలయ కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా ఉంటుంది. అలాగే ఆలయంలోని గర్బగుడిలో విగ్రహంపై నీటి బిందువులు పడతాయని స్థానికులు చెప్తుంటారు. ఇక కోనేటిలో అన్ని సీజన్‌లలోనూ నీరు ఉంటుందని ఇక్కడి జనం చెప్తున్నారు.