ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారం రోజుల గ్యాప్‌లో రెండోసారి భేటీ.. ఈ సారి ఆ నిర్ణయం పక్కా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 09:05 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 23వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాయం వేదికగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ విషయమై అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ లేఖలు రాశారు. ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు మంత్రివర్గ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని లేఖలో సూచించారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీ ఇటీవలే జరిగింది. అక్టోబర్ 16వ తేదీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, క్లీన్ ఎనర్జీ పాలసీలకు ఆమోదం లభించింది.


ఇక ధరల నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణ, ఉద్యోగాల కల్పనపై మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారం రోజులు కూడా తిరగకుండానే మరోసారి మంత్రివర్గం భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి అక్టోబర్ పదో తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సింది. అయితే రతన్ టాటా మరణంతో మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అనంతరం అక్టోబర్ 16న ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఇది జరిగిన వారం రోజులలోనే అక్టోబర్ 23న మరోసారి భేటీ కానుంది. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఈ పథకం అమలుకు పచ్చజెండా ఊపుతారని అందరూ భావించారు. అయితే మొన్నటి కేబినెట్ భేటీలో పారిశ్రామిక పాలసీలపైనా ప్రధానంగా చర్చ జరిగింది.


ఇక అక్టోబర్ 31న దీపావళి పండుగ రానుంది. ఈ నేపథ్యంలో ఆలోపే మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే అక్టోబర్ 23న మంత్రివర్గ భేటీ జరనుంది. ఈ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు, విధివిధానాలతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైనా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే సూపర్ సిక్స్ హామీల అమలు ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, దేవాలయాల పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణ వంటి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపి దీపావళి కానుక కింద ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com