తెల్ల రేషన్‌కార్డు అనేది ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలను ఓ ప్రామాణిక పత్రంగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా.. స్వచ్ఛంద సంస్థలు కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రేషన్ కార్డు ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తూ.. తమకు చేతనైన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెల్ల రేషన్‌కార్డు కలిగిన వారికి రూడ్ సెట్ సంస్థ శుభవార్త వినిపించింది. తెల్ల రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, మగ్గం ట్రైనింగ్ ఇస్తామని ప్రకటించింది. 30 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తామని రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (రూడ్ సెట్) ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే ఇది కేవలం అనంతపురం జిల్లాలోని మహిళలకు మాత్రమే. అనంతపుర జిల్లాలోని మహిళలకు జర్దోసి, మగ్గం, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తామని రూడ్ సెట్ అనంతపురం జిల్లా డైరెక్టర్ లక్ష్మిదేవి తెలిపారు. నవంబర్ 15 నుంచి 30 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ 30 రోజులు ఉచిత వసతి, భోజనం కూడా అందిస్తామని.. ఆసక్తి ఉన్నవారు వెంటనే అనంతపురంలోని రూడ్ సెట్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
మరోవైపు రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (రూడ్ సెట్) సంస్థను 1982లో స్థాపించారు. ఈ సంస్థకు ప్రతి జిల్లాలోనూ కార్యాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత యువతను వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో.. వారికి స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందిస్తుంటారు. మహిళలు అయితే బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే యువకులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్ ఫోన్ రిపేర్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు ఉచిత బ్యూటీషియన్ కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు.