ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. శుక్రవారం విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. విశాఖ ఎంపీ భరత్‌తో పాటుగా ఆయన కోర్టుకు వచ్చారు. అదేంటీ మంత్రి నారా లోకేష్ కోర్టుకు రావటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. సుమారుగా ఐదేళ్ల కిందటి కేసులో నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు వచ్చారు. అసలు విషయానికి వస్తే ఐదేళ్ల కిందట.. ఓ పత్రికలో నారా లోకేష్ మీద కథనం వచ్చింది. 2019 అక్టోబర్‌లో చినబాబు చిరుతిండి.. రూ.25 లక్షలండి అంటూ ఓ పేపర్‌లో కథనం వచ్చింది. దీనిపై నారా లోకేష్ విశాఖ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై అసత్య కథనాన్ని ప్రచురించి, తన పరువుకు నష్టం కలిగించారంటూ రూ.75 కోట్లకు నారా లోకేష్ విశాఖ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఇక ఈ కేసు విచారణకు రాగా.. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నారా లోకేష్ శుక్రవారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి వచ్చారు. శుక్రవారం నాటికి వైజాగ్ చేరుకున్న నారా లోకేష్ పార్టీ ఆఫీసులోనే బస చేశారు. అనంతరం ఎంపీ భరత్‌తో కలిసి అదనపు జిల్లా న్యాయస్థానానికి చేరుకున్నారు. అక్కడ కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. మరోవైపు విశాఖ జిల్లా ఆఫీసులో నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతి రోజూ ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అయితే కోర్టు కేసు కోసం విశాఖకు వచ్చిన నేపథ్యంలో అక్కడే పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బర్మా కాందిశీకుల భూములు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బర్మా ఆంధ్రా కాందిశీకుల కేంద్ర సంఘం ప్రతినిధులు నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే 2013 ఏడాది ఆర్టీసీ రిక్రూట్మెంట్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఆర్టీసీ డ్రైవర్లు.. నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి ఇప్పించాలని, భూ వివాదాల సమస్యలు , ఉద్యోగావకాశాలు కల్పించాలని పలువురు కలిసి వినతులు అందించారు. వారి సమస్యలను ఓపికగా విన్న నారా లోకేష్.. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.