వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ జీవీ, గద్దె బ్రహ్మాజీ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో ఎంవీవీ అక్కడ లేరని తెలుస్తోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పైనే ఈడీ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎంవీవీ సత్యనారాయణపై హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదుతో.. ఇటీవల నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలతో ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టును ఆశ్రయించగా.. ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 12.5 ఎకరాల భూమిని.. నకిలీ పత్రాలతో సత్యనారాయణ తదితరులు లాక్కునేందుకు ప్రయత్నించారని హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ జగదీశ్వరుడు ఆరోపిస్తున్నారు.
విశాఖపట్నంలోని ఆదర్శ్ నగర్ నివాసి, హయగ్రీవ ఫార్మ్స్& డెవలపర్స్ మేనేజింగ్ జగదీశ్వరుడు, భార్య రాధా రాణిలు ఈ కంపెనీలో ఉన్నారు. 2006 నుంచి కంపెనీ ఉండగా.. 2008లో వీరికి ఎండాడ దగ్గర సీనియర్ సిటిజన్, అనాథ గృహాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12.51 ఎకరాలు మంజూరు చేసింది. 2010లో ఈ భూమిని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేశారని చెబుతున్నారు జగదీశ్వరుడు. ఆడిటర్ జీవీ తనను ఎంవీవీ సత్యనారాయణకు, గద్దె బ్రహ్మాజీకి పరిచయం చేశారని.. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కోసం పరిచయం చేశారన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం 2020లో ఎంవోయూ చేసుకోగా.. ఎంవీవీ, బ్రహ్మాజీ, జీవీలు కలిసి ఫోర్జరీ సంతకాలు, విక్రయ పత్రాలను తయారు చేశారని..తమను బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించారని ఆరోపించారు. తమ విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని.. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని జగదీశ్వరుడు ఆరోపించారు.
ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్‌గా ఉన్నారు.. గీతాంజలి, అభినేత్రి, లక్ ఉన్నోడు, నీవెవరో వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.. వైఎస్సార్‌సీపీలో చేరి.. 2019 ఎన్నికల్లో విశాఫట్నం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2024 ఎన్నికలలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ ఈడీ సోదాలపై ఎంవీవీ సత్యనారాయణ స్పందించాల్సి ఉంది.