తిరుమలలో ఓ యువకుడు రెచ్చిపోయాడు.. కత్తి తెచ్చుకుని గాయాలు చేసుకోవడం కలకలం రేపింది. కొండపై ఉన్న లేపాక్షి సర్కిల్ దగ్గర ఓ యువకుడు తనలో తను మాట్లాకుంటూ కనిపంచాడు. ఆ వెంటనే తన దగ్గరున్న కత్తితో చేతుల్ని కోసుకుని గాయపరుచుకున్నాడు. కొంతమంది భక్తులు గమనించి వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వెంటనే అక్కడికి చేరుకుని 108 వాహనంలో యువకుడిని తిరుమలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడ్ని నెల్లూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన రేవంత్‌గా గుర్తించారు.
ఆ యువకుడికి మతి స్థిమితం లేదని అనుమానిస్తున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. అతడు తిరుమలకు ఎలా వచ్చాడు.. ఎవరితోనైనా వచ్చి తప్పిపోయాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అతడికి కత్తి ఎక్కడి నుంచి వచ్చింది.. అలిపిరి దగ్గర తనిఖీల్లో ఈ కత్తిని గుర్తించలేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది యువకుడి గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలపై కసరత్తు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్ , హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు జేఈవో. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల(పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ . పంచమి తీర్థం రోజున భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే షెడ్లలో, క్యూలైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.