ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం ఉదయం కాల్పుల కలకలం రేగింది. అయితే కాల్పులు జరిపింది.. మాత్రం తెలంగాణ పోలీసులు కావటం గమనార్హం. అదేంటీ ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పోలీసులకు పనేంటి.. వారెందుకు వచ్చారు.. కాల్పులు ఎందుకు జరిపారనే వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. రామాపురం బస్టాప్ సమీపంలో ఉదయాన్నే తుపాకుల శబ్దం వినిపించింది. దీంతో రామాపురం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ చోరీ కేసులో విచారణలో భాగంగా... బిహార్‌కు చెందిన ఓ దొంగల ముఠా సంచరిస్తోందనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అక్కడికి వచ్చారు. అయితే వీరిపైకి దొంగలు దాడికి యత్నించడంతో.. తెలంగాణ పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.
ఇక దొంగలను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు కాల్పులు జరుపుతూ వారిని వెంబడించినట్లు సమాచారం. అయితే ద్విచక్రవాహనాల్లో ఈ ముఠా పారిపోయింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక కాల్పుల సమాచారం అందుకున్న ధర్మవరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డీఎస్పీతో పాటుగా సీఐలు, ఎస్‌ఐలు రామాపురానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మొత్తంగా ఉదయమే జరిగిన ఈ కాల్పుల ఘటన రామాపురం వాసులను భయాందోళనకు గురిచేసింది.