అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి తరుణంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పులిపిరికాయల్లాంటి చిన్నపాటి పొక్కులు వస్తూ మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి.కానీ ఇవి అంత ప్రమాదమేమీ కాకపోయినా, అందం విషయానికి వస్తే వీటిని తొలగించుకోవడానికి అధిక శాతం మంది ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిన ఇంగ్లిష్ మందులను వాడకుండా, సహజ సిద్ధమైన పదార్థాలతో ఆ పొక్కులను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.మెడ, ముఖం వంటి భాగాలపై ఏర్పడే పొక్కులను, పులిపిర్లను తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. సింపుల్‌గా ఒక కాటన్ బాల్ లాంటి దాన్ని తీసుకుని దాన్ని ఈ ఆయిల్‌లో ముంచి చర్మంపై రాయాలి. అనంతరం దాన్ని ఒక రాత్రి పాటు అలాగే వదిలేయాలి. తెల్లారాక నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పొక్కులు త్వరగా మాయమవుతాయి. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఆముదంలో కలపాలి. మెత్తని పేస్ట్ వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని సంబంధిత చర్మ భాగంపై రాయాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసిన తరువాత కొద్దిగా పిన్ గుచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి చూసి వాడండి.
చర్మ సంరక్షణకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు నిమ్మలో ఉన్నాయి. కొద్దిగా నిమ్మరసాన్ని సమస్య ఉన్న చర్మ భాగంపై రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. రోజూ ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. ఓ కాటన్ బాల్‌ను తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి అనంతరం చర్మంపై రాయాలి. కొద్దిగా పిన్‌తో గుచ్చినట్టు అనిపిస్తుంది. కానీ దాని నుంచి వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అరటి తొక్క అని అలా తీసిపారేయకండి. ఎందుకంటే అందులో చర్మాన్ని సంరక్షించే గుణాలు కూడా ఉన్నాయి. ఓ అరటి తొక్కను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. అనంతరం వాటిని సమస్య ఉన్న చర్మ భాగాలపై పెట్టాలి. రాత్రంతా వాటిని అలాగే వదిలేయాలి. అయితే ఆ ముక్కలు రాలిపోకుండా ఏదైనా గుడ్డ లాంటి దాన్ని వాటిపై కప్పవచ్చు. తరచూ ఇలా చేస్తే పొక్కులను దూరం చేసుకోవచ్చు.
కొద్దిగా ఉల్లిపాయల్ని తీసుకుని ఒక గ్లాస్ ఉప్పు నీటిలో కొంత సేపు నానబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చర్మ భాగాలపై రాసి, పరిశుభ్రమైన గుడ్డతో కప్పేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారం రోజుల పాటు ప్రతి రోజు రాత్రి ఇలా చేస్తే త్వరలోనే మీ ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. పైనాపిల్ జ్యూస్‌ను సమస్య ఉన్న చర్మ భాగాలపై రాయాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.