బద్వేలులో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన విద్యార్ధిని మృత్యుఒడికి చేరడం అత్యంత బాధాకరమని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బద్వేలు అఘాయిత్యం అనాగరిక చర్య అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి, కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే బద్వేలులో కూడా అలాంటి ఘటన చోటుచేసుకోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలు గాలికొదిలేసింది కూటమి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ ఉండటంతో పాటు మహిళల భధ్రత విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం మహిళా హోం మంత్రి ఉన్నారు కదా మీరేం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వరుస సంఘటనలు జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలో విజయదశమి రోజు అత్తా కోడళ్ళపై గ్యాంగ్ రేప్ జరిగింది, ఇదే కాదు ఇలా అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బద్వేలు అఘాయిత్యం అనాగరిక చర్య, గతంలో వైఎస్ జగన్ పటిష్టమైన దిశ చట్టాన్ని తీసుకువస్తే కూటమి ప్రభుత్వం దానిని నీరుగార్చింది, ఈ నాలుగు నెలల్లోనే మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇన్ని జరుగుతుంటే చంద్రబాబు మాత్రం మౌనంగా ఉన్నారు.చంద్రబాబు గారు అధికారం ముఖ్యం కాదు, ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే బాధ్యతాయుత ప్రతిపక్షంగా మేం గట్టిగా నిలదీస్తాం, ప్రభుత్వానికి కొమ్ముకాసే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తగిన విధంగా స్పందించాలి. మా వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించడం మానుకుని ప్రజలకు మంచి చేయడంపై దృష్టిపెట్టాలని హితవు పలుకుతున్నాం. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇలాంటి దారుణాలపై దృష్టిపెట్టి కట్టడి చేయండి, దోషులను కఠినంగా శిక్షించి మహిళలకు భరోసా కల్పించాలి. ఈ పరిణామాలన్నింటినీ వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.