రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై హత్యలు, అగాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సంతాపాలు తెలిపి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై పెట్రోల్ పోసిన ఘటనపై వరుదు కళ్యాణి విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభత్వంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, ప్రమాదకరస్థాయికి చేరాయని, ఆడపిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆక్షేపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, సీఎం ఉన్నారా? అని ఆమె మండిపడ్డారు. వరసగా అత్యాచార ఘటనలు, దారుణహత్యలు జరుగుతున్నా హోం మంత్రి కానీ, ఆడపిల్లల రక్షణకు కంకణం కట్టుకున్నానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కానీ స్పందించడం లేదని దుయ్యబట్టారు. నాలుగు నెలలకే మహిళల రక్షణను గాలికి వదిలేశారన్న ఎమ్మెల్సీ, దిశ యాప్ ఉండి ఉంటే బద్వేల్‌లో దారుణహత్యకు గురైన బాలిక బ్రతికి ఉండేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి చేసి, దిశ చట్టాన్ని ఆమోదింపచేసి, అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు విఘాతం కలిగితే ఊర్కోబోమన్న వరుదు కళ్యాణి.. ప్రజలు, మహిళలతో పోరాడతామని ప్రకటించారు. రాష్ట్రంలో అసలు ఆడపిల్లలు బ్రతకాలా? వద్దా? అన్న సందేహం కలుగుతోందని, అందుకు టీడీపీ కూటమి నాలుగు నెలల దారుణ పాలనలో చోటు చేసుకున్న అనేక ఘటనలు కారణమని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చెప్పారు. హోమ్ మంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇద్దరు మహిళలకు బట్టలుడదీసి కొట్టినా స్పందించ లేదని, పక్క నియోజకవర్గంలో బాలిక అదృశ్యమైనా పట్టించుకోలేదని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని గుర్తు చేశారు. మాఫియాలా మారి ఎక్కడికక్కడ ఇసుక, మద్యం ద్వారా దోచుకోవడం తప్ప మహిళలు రక్షణ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.
ఎంతసేపూ జగన్‌గారిని విమర్శించడం, వెకిలిగా మాట్లాడడం తప్ప, హోం మంత్రి చేస్తోంది ఏమీ లేదని, వి«ధి నిర్వహణలో ఆమె దారుణంగా విఫలమయ్యారని వరుదు కళ్యాణి తెలిపారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వాష్‌రూమ్‌ల్లో హిడెన్ కెమెరాలతో 300 మంది విద్యార్థినిలు ఆందోళన చేసినా పట్టించుకోలేదని, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక మృతదేహం ఇప్పటికీ దొరకలేదని, గుర్తు చేశారు. అసలు తాము మహిళలకు రక్షణ కల్పించగలమా? లేదా? అన్నది కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పాలని వరుదు కళ్యాణి కోరారు. వీకెండ్ అయితే చాలు సీఎం, డిప్యూటీ సీఎం విశ్రాంతి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిపోతారని, ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోరని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్ రూపొందించడమే కాకుండా, ప్రత్యేకంగా 12 దిశ పోలీస్ స్టేషన్లు, 12 మహిళా కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ పోలీసులకు 900 బైక్‌లు, 168 బొలెరో వాహనాలతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారని వరుదు కళ్యాణి గుర్తు చేశారు. 12 దిశ పోలీస్‌స్టేషన్లలో డీఎస్పీ స్థాయి అధికారులను నియమించారని తెలిపారు. దీంతో ఎంతో మంది ఆడపిల్లలను ఆపద నుంచి కాపాడడం జరిగిందన్న ఆమె, కూటమి ప్రభుత్వంలో చివరకు ఒక సీఐ తల్లికి కూడా రక్షణ లేదని గుర్తు చేశారు.