గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అధికారుల తనిఖీల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. గుజరాత్ పోలీసులు డ్రగ్స్‌పై నిర్వహించిన ఆపరేషన్‌లో 400 కిలోలకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.భరూచ్ జిల్లా అంక్‌లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్‌సర్ ఎంటర్‌ప్రైజెస్‌లో సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 427 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను టెస్టుల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం.పక్కా సమాచారం మేరకు జిల్లా ఎస్‌ఓజీ, సూరత్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి ఆనంద్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురి అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపినట్టుగా చెప్పారు.కాగా, అక్టోబరు 13న ఇదే ఫ్యాక్టరీకి సమీపంలోని అవ్కార్ అనే కర్మాగారంలో గుజరాత్, ఢిల్లీ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో రూ. 5,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకులో 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి కూడా ఉన్నట్టు గుర్తించారు.