తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో క్యాస్ట్ సర్టిఫికెట్ అలానే ఇతర సర్టిఫికెట్స్ కష్టాలను యువత ఏకరువు పెట్టారు. వాట్సాప్‌లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మనిషికి అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నప్పుడు, సేవలు అందుతున్నప్పుడు.. ఒక సర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెడతామని, ప్రభుత్వంలోకి రాగానే..వాట్సాప్ ద్వారా పర్మినెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తోంది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యతాక్రమంలో అమలు చేస్తున్నారు. ప్రతి ఏడాది క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే పద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ రకాల బిల్లులు వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్ స్టా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మెటా ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌరసేవలు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీకరించింది.
మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నరెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని 1 జన్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ చేసుకున్నారు.