తూర్పు మధ్య బంగాళాఖాతంలో దానా తుపాను గురువారం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. దానా తుపాను రేపటికల్లా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ తుపాను రేపు అర్ధరా త్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రజలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు
తుపాను ప్రభావం, ఈదురుగాలుల నేపథ్యంలో భారీ వృక్షాలు, చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఎండిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించాలని, వాటి వద్ద ఉండొద్దని హెచ్చరించింది. అలాగే వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్ షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండాలని సూచించింది. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. కరెంట్, టెలిఫోన్ స్థంభాలు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే అనవసర ప్రయాణాలు మానుకోవాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. తుపాను ప్రభావంతో బుధవారం, గురువారం సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొ్ద్దని సూచించారు.
ఇక దానా తుపాను కారణంగా పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇక ఈ రైళ్ల వివరాలను తెలియజేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.