అత్యవసర సమయాల్లో, ఆపద వేళల్లో అందరికీ ఠక్కున గుర్తొచ్చేది.. 108. ఫోన్ కాల్ వస్తే చాలు.. వాయు వేగంతో ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు అండగా నిలుస్తుంటారు అంబులెన్స్ సిబ్బంది. సకాలంలో వారిని ఆస్పత్రులకు తరలిస్తూ.. వారి ప్రాణాలు నిలబెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి అంబులెన్స్ సిబ్బందికి కూడా అప్పడప్పుడూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఫేక్ కాల్స్ ద్వారా కొంతమంది తప్పుదారి పట్టిస్తే.. మరికొంత మంది అమాయకత్వంతో చేసే పనులు కూడా వీరి విలువైన సమయాన్ని వృథా చేస్తుంటాయి. అలాంటి ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ గర్భిణీ మహిళ అమాయకత్వంతో చేసిన పని.. అంబులెన్స్ సిబ్బందికి ఇక్కట్లు తెచ్చిపెట్టింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుర్రాల గొందికి చెందిన వంతల శ్రావణికి గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ముందుగానే ఆస్పత్రికి వెళ్దామనే ఉద్దేశంతో ఆమె కుటుంబసభ్యులు 108కు ఫోన్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. స్థానిక ఏఎన్ఎం, సచివాలయం సిబ్బంది గుర్రాలగొంది గ్రామానికి చేరుకున్నారు. అయితే ఊర్లోకి అంబులెన్స్ వస్తున్న శబ్దం రావటంతో.. శ్రావణి భయపడిపోయింది. అంబులెన్స్ వస్తోంది తమ ఇంటికే అని తెలిసి.. సమీపంలోని అడవిలోకి పారిపోయింది. తీరా అక్కడకు చేరుకున్న 108 సిబ్బందికి గర్భిణి కనిపించలేదు. కుటుంబసభ్యులతో కలిసి ఊరంతా గాలించారు. కానీ ఎక్కడా శ్రావణి జాడ కనిపించలేదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే గురువారం సాయంత్రం వైద్య సిబ్బంది మరోసారి గ్రామానికి వెళ్లారు. అప్పటికే శ్రావణి ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులు కూడా ఆమెకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్ సిబ్బంది కూడా ఆమెకు ధైర్యం చెప్పి.. గర్బిణీగా ఉన్న సమయంలో ఆస్పత్రి అవసరంపై ఆమెకు అవగాహన కల్పించారు. దీంతో శ్రావణి ఆస్పత్రికి వచ్చేందుకు అంగీకరించింది. అనంతరం అంబులెన్సులో శ్రావణిని గూడెం కొత్తవీధి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. అయితే ఇలాంటి పనులు ఎవరూ చేయవద్దని అంబులెన్స్ సిబ్బంది కోరుతున్నారు. అత్యవసర సమయంలో ఫోన్ చేసి.. తీరా అక్కడకు వెళ్లేసరికి లేకుండా పోవటం సరైన పద్ధతి కాదంటున్నారు. ఇలా చేయడం వలన రోగులకు ఇబ్బంది కావటంతో పాటుగా.. అంబులెన్స్ అవసరం ఉన్న మరో చోట కూడా ఇబ్బంది వస్తుందంటున్నారు.