వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఈ విషయమై వైఎస్ షర్మిల లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని విలేకర్ల సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. అయితే వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు షర్మిల బదులిచ్చారు. శనివారం విజయవాడలోకి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో షర్మిల విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల విమర్శలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి.. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తని మండిపడ్డారు. అలాంటాయన ఇంకెళా మాట్లాడతారని అన్నారు. అయితే అన్నీ తెలిసి కూడా సుబ్బారెడ్డి చిన్నాన్న ఇలా మాట్లాడటం బాధేస్తోందని షర్మిల కన్నీరు పెట్టుకున్నారు.
"జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సులభంగా ఈ విషయాన్ని ఘర్ ఘర్ కీ కహానీ అంటున్నారు. కన్న తల్లిని కోర్టుకు ఈడ్చటం అన్ని ఇళ్లల్లోనూ జరిగే విషయమా..? కన్నతల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా? మీకు మానవత్వం, ఎమోషన్, సెంటిమెంట్లు లేవా.. సజ్జల, పేర్నిలాంటోళ్లు మాట్లాడితే నేను పెద్దగా పట్టించుకోను. కానీ సుబ్బారెడ్డి చిన్నాన్న మాట్లాడితే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. ఎందుకు చిన్నాన్నా. నా బిడ్డలు మీ ముందు పెరగలేదా.. మిమ్మల్ని తాతా అనలేదా.. ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఏది నిజమో మీకు తెలియదా? ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడున్నాడు. చూస్తున్నాడు" అంటూ వైఎస్ షర్మిల ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోవైపు తాను చెప్తున్నది నిజమని ప్రమాణం చేస్తానన్న వైఎస్ షర్మిల.. సుబ్బారెడ్డి చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. నలుగురు మనవళ్లకు సమాన వాటా ఇవ్వాలని వైఎస్ఆర్ చెప్పారన్న షర్మిల.. తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని అన్నారు. వైఎస్ఆర్ అలా చెప్పలేదని.. ఇది నిజం కాదని వైవీ సుబ్బారెడ్డి, జగన్ వారి బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ అనుమతి ఇస్తేనే కంపెనీలకు భారతి, జగతి అనే పేర్లు పెట్టారన్న షర్మిల.. పేర్లలో ఏముందిలే అన్న ముచ్చటపడ్డాడని తాను కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. కానీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు వారివి అవుతాయా అంటూ ప్రశ్నించారు.
ఇక ఆస్తులు మొత్తం జగన్‌వేనని.. అందుకే ఆయన జైలుకు వెళ్లారని సుబ్బారెడ్డి చెప్తున్నారన్న షర్మిల.. భారతి పేరు మీద ఆస్తులు ఉంటే ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏ అన్న అయినా.. గిఫ్ట్ అంటే బంగారమో, చీరనో ఇస్తారని.. ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా అని ప్రశ్నించారు. జగన్ ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదనీ.. తన హక్కు కావునే ఇస్తామన్నారు. ఇక గిఫ్డ్ కింద ఇచ్చిన దానికి ఎవరైనా ఎంవోయూ చేసుకుంటారా అని ప్రశ్నించారు.
మరోవైపు వైఎస్ జగన్ అంటే తనకు ప్రాణమన్న షర్మిల.. అన్న కోసమే పాదయాత్ర చేశానని.. సూర్యుడి దగ్గరకు వెళ్లమన్నా వెళ్లేదానినని చెప్పారు. "వైఎస్ జగన్ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. జగనన్న పాదయాత్రకు వెళ్లు అనగానే వెళ్లిపోయా. పాదయాత్రకే కాదు.. సూర్యుడు దగ్గరకు వెళ్లమన్నా.. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వెళ్లిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. నేనేం తప్పు చేశాను? వైసీపీ నేతలు ఒక్క కారణం చెప్పండి. జగన్ గారి కోసం ఉప ఎన్నికల కోసం తిరిగా. సమైక్యాంధ్ర కోసం తిరిగాను. ఎక్కడ అవసరం వస్తే అక్కడ తిరిగాను. తెలంగాణలో ఓదార్పుయాత్ర కోసం తిరిగాను. రెండు ఎన్నికలలో ప్రచారం చేశా. బై బై బాబు క్యాంపెయిన్ చేశాను. మరి జగన్ కోసం నేను ఇంత చేస్తే.. జగన్ నా కోసం ఒక్కటైనా చేశారా.. జగన్ మోహన్ రెడ్డి నాకు జన్మలో ఏమైనా చేశారా.. జగన్ నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఇది అమ్మకు, నాన్నకు అందరికీ తెలుసు" అని షర్మిల చెప్పుకొచ్చారు.