రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నవంబర్ నెల నుంచి తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధరలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం తగ్గించేందుకు రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతుబజార్ల ద్వారా వంటనూనెలు, కందిపప్పును ఏపీ ప్రభుత్వం సబ్సిడీ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నవంబర్ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అందించనున్నారు. మార్కెట్‌లో కంది పప్పు కేజీ రూ.180 ఉండగా.. కిలో కందిపప్పును రేషన్ కార్డుదారులకు కిలో రూ.67లకే పంపిణీ చేయనున్నారు.
కందిపప్పుతో పాటుగా పంచదారను కూడా రేషన్ దుకాణాల్లో అందించనున్నారు. ఇందుకోసం కందిపప్పు, చక్కెరలు ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాయి. నవంబర్ నెలలో బియ్యంతోపాటు.. కందిపప్పు, పంచదార, జొన్నలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కిలో కందిపప్పు రూ.67 లకే అన్ని కార్డుదారులకు అందిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పంచదారను కూడా అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు కిలో రూ.14 చొప్పున, మిగతా కార్డులకు అర కిలో 17 రూపాయలకు అందిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇక బియ్యం బదులుగా పంపిణీ చేసేందుకు జొన్నలు సైతం రెడీగా ఉంచారు. కార్డుకు మూడు కేజీల చొప్పున జొన్నలు పంపిణీ చేస్తారు.
మరోవైపు నవంబర్ నెల నుంచి ప్రతి నెలా పక్కాగా కందిపప్పు అందిస్తామని పౌరసరఫరాల శాఖ చెప్తోంది. కందిపప్పు, పంచదారతో పాటుగా గోధుమపిండి, రాగులు, జొన్నలు కూడా రేషన్ దుకాణాల ద్వారా అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. జనవరి నుంచి ఈ సరుకులను కూడా రేషన్ బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరిగింది. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారు ఈ పద్ధతిని మార్చింది. పాత పద్ధతిలోనే తిరిగి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తోంది. ఎండీయూ వాహనాల మెయింటైన్స్‌కు అదనపు భారం పడుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.