ఏపీలో విమానయాన రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు నియమితులైన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన విమాన సర్వీసులు వస్తున్నాయి. తాజాగా విశాఖ నుంచి విజయవాడకు మరో రెండు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆదివారం ( అక్టోబర్ 27) నుంచి విశాఖపట్నం - విజయవాడ మధ్య మరో రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ప్రారంభిస్తారు.
సర్వీసుల విషయానికి వస్తే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్డు నుంచి ఇండిగో సర్వీసు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అనంతరం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 9 గంటల 50 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి తిరిగి చేరుకుంటుంది. ఇక ఎయిర్ ఇండియా సర్వీస్ విషయానికి వస్తే ఈ విమాన సర్వీసు విశాఖ నుంచి ఉదయం అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటల 35 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతుంది. ఉదయం 10.35 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి బయల్దేరి రాత్రి 9 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది.
మరోవైపు ఈ రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రావటంతో విజయవాడ- విశాఖపట్నం మధ్య విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరుతుంది. మరోవైపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో వేగం పెరగ్గా.. విజయవాడ ఎయిర్ పోర్టులో నూతన టెర్మినల్ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు ఏపీలో ఇప్పటికి ఏడు విమానాశ్రయాలు ఉండగా.. మరో ఏడింటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్ సహా పలుచోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు.