సినీ నటి శ్రీరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనేది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వైసీపీకి, వైఎస్ జగన్‌ను అనుకూలంగా పోస్టులు, వీడియోలు పెడుతుంటారు. అలాగే టీడీపీ నేతలపైనా, ఆ పార్టీపైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే శ్రీరెడ్డి ఏం వీడియో చేసినా, ఏ ట్వీట్ చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా వైసీపీకి చెందిన మహిళా నేతకు శ్రీరెడ్డి మద్దతు పలికారు. అలాంటి లీడర్‌ను అధికార ప్రతినిధిగా నియమించాలని కోరారు. ఈ మేరకు వైసీపీని కోరుతూ శ్రీరెడ్డి ఓ ట్వీట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి మద్దతు పలుకుతూ.. ఆమెను అధికార ప్రతినిధిగా నియమించాలని శ్రీరెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కోరారు.
"వరుదు కళ్యాణి గారి గురించి అందరికీ తెలిసిందే. విపక్షాల ఆరోపణలకు తన ప్రసంగాల ద్వారా దీటుగా బదులివ్వడంలో ఆమెకు ఆమే సాటి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి కావాల్సిన అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. ఆమె క్యారెక్టర్, ప్రవర్తన, సీనియారిటీ. ఛార్మింగ్ ఫేస్, యాక్టివ్ నెస్, రాజకీయాల్లో ఆమె అనుభవం అన్నీ కలిస్తే ఎంతో ఉపయోగం. వైసీపీ ఫాలోవర్లు అందరమూ ఆమెకు ఈ పదవి దక్కుతుందని ఆశిస్తున్నాం. దీనికి మీలో ఎంత మంది అంగీకరిస్తారు?" అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు.
మరోవైపు వైసీపీ అధికార ప్రతినిధులుగా మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి నేతలకు వైఎస్ జగన్ అవకాశమిచ్చారు. అయితే మిగతా వారి సంగతి పక్కన బెడితే యాంకర్ శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడాన్ని శ్రీరెడ్డి తప్పుబడుతున్నారు. వైసీపీ పార్టీ కోసం తాము పనిచేస్తే.. ఏం పని చేయని శ్యామల వంటి వారికి అధికార ప్రతినిధిగా అవకాశమిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అదృష్టం అంటే ఈమెదే. పార్టీ కోసం ఏ పని చేయకపోయినా అందలం ఎక్కించారు.
జై టీడీపీ బెదిరింపులు, తిట్లు ఏమో మాకు. పోస్టింగులు, ప్రెస్ మీట్‌లు ఆమెకా.. అంటూ ఇటీవల శ్రీరెడ్డి యాంకర్ శ్యామల మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్యామలను తెగ హైలైట్ చేస్తున్నారనీ.. శని నెత్తి మీద కూర్చున్నట్టే నంటూ వీడియోలో విమర్శలు గుప్పించారు. అయితే యాంకర్ శ్యామల మీద విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి.. వరుదు కళ్యాణి లాంటి నేతలను అధికార ప్రతినిధులుగా నియమించాలని కోరుతూ ఉండటంతో, శ్యామల మీద సెటైరికల్‌గా కోపంతోనే ఇలా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.