ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం శ్రీనివాసుడిని దర్శించారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మొదటి సారి జిల్లాకు వచ్చానని తెలిపారు. బృహత్తరమైనటువంటి బాధ్యతను సీఎం తనపై ఉంచారన్నారు. మంచి ప్రణాళిక, లక్ష్యంతో రాష్ట్రాన్ని పునః నిర్మించుకోవాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు.
130 రోజుల్లో 130 కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. జగన్, షర్మిల మధ్య కుటుంబ సమస్యను తమపై రుద్దడం కరెక్ట్ కాదన్నారు. అబద్ధాల పునాదుల్లో నుంచి వైసీపీ పార్టీ పుట్టిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పి.. జగన్ నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో ఇలాంటి ఇబ్బంది లేదన్నారు. కుటుంబ సమస్యలు వాస్తవమని షర్మిల బహిర్గతం చేస్తే తమపై విమర్శలు చేయడం తగదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.