2014-19లో గత తెలుగుదేశం పాలనలో వెలుగొండ ప్రాజెక్టుకు రూ. 1373 కోట్లు కేటాయించి,1319 కోట్లు ఖర్చు చేశామని, గత అయిదేళ్ళ జగన్ పాలనలో రూ. 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి, కేవలం రూ.170 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.
నిర్వాసితులను హౌస్ అరెస్ట్ చేసి జగన్ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించారని, రెండో టన్నెల్‌లో తవ్విన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివర భాగాన పోశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రెండో టన్నెల్ 12వ కిలో మీటర్ దగ్గర మూడేళ్ళ క్రితమే టన్నెల్ బోరింగ్ మెషిన్ పాడై ఉంటే దానిని ఎందుకు బయటకు తీయలేకపోయారని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా జగన్ విధ్వంసమే కనిపిస్తోందన్నారు. కాగా రెండు దశల్లో వెలుగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫేజ్-1లో హెడ్ వర్క్స్, రెండు టన్నెల్స్, ఫీడర్ ఛానెల్, రిజర్వాయర్, రెగ్యులేటర్ వంటి నిలిచినపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి 1.19 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.