భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విజయవాడ చేరుకున్న ఆయనకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లికి వెళ్లిన కపిల్ దేవ్.. సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అయితే ప్రధానంగా ఏపీలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపైనా కపిల్‌దేవ్‌తో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఏపీలో ఇప్పటికే గోల్ఫ్ కోర్టు ఉంది. విశాఖపట్నంలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ఫ్ క్లబ్ ఉంది. అయితే ఇలాంటిదే రాజధాని అమరావతిలోనూ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధితో క్రీడారంగానికి ప్రోత్సాహం అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం 2014-19 మధ్య అనుసరించిన విధానాలను తిరిగి తేవాలని భావిస్తోంది. అలాగే అప్పట్లో తాము ప్రారంభించి సగంలో నిలిచిపోయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటారు. క్రీడలు అంటే కేవలం పోటీల్లో పాల్గొనడానికి మాత్రమే కాదని.. మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యమని చంద్రబాబు నమ్ముతారు.
ఇక గతంలో గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ వంటి గేమ్స్ ఆడేవారని.. అయితే టీవీలు, సోషల్ మీడియాల కారణంగా యువత వాటికి దూరమైందని చంద్రబాబు ఉద్దేశం. అందుకే గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలని కూడా స్పష్టం చేశారు. వీలైతే 2027 జాతీయ క్రీడలు కూడా ఏపీలో నిర్వహించేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం నూతన క్రీడా పాలసీని రూపొందించాలని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. తాజాగా కపిల్ దేవ్‌తో భేటీ కావటంతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల ప్రోత్సాహం దిశగా అడుగులు పడినట్లేనని భావిస్తున్నారు.