శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం సంచాం పంచాయతీ పున్నానపాలెం గ్రామం మాత్రం.. దీపావళి వేడుకులకు దూరం కానుంది. తాత ముత్తాతల నుంచి ఈ సంప్రదాయం ఉండగా.. నేటి తరం కూడా ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ.. దీపావళి సంబరాలు చేసుకోకపోవడం గమనార్హం. ఇంతకీ వారు దీపావళి వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారో.. తెలుసుకుందాం. పున్నానపాలెంలో సుమారు రెండువేలకుపైగా జనాభా ఉన్నారు. అధిక కుటుంబాల ఇంటి పేరు పున్నాన. ఈ గ్రామంలో ప్రధానంగా కాపు, యాదవ సామాజిక వర్గాలు ఉన్నాయి. గ్రామస్థుల్లో 95శాతం మందికిపైగా.. తాత ముత్తాతల నుంచీ దీపావళి, నాగులచవితి పండగలు చేసుకోవడం లేదు. తొలుత వ్యవసాయం చేయడానికి కాపు కులానికి చెందిన రైతు, అలాగే గొర్రెల కాపరిగా యాదవ కులానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఈ గ్రామానికి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారని కథనం.
అనంతరం ఈ రెండు కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ నేడు 155 కుటుంబాలు ఏర్పడ్డాయి. సుమారు 150ఏళ్ల కిందట ఈ గ్రామంలోని ఒక రైతు దీపావళి, నాగులచవితి పండగ చేసిన తర్వాత కొన్ని కష్టనష్టాలు కలగడంతో ఈ రెండు పండగలను బహిష్కరించారని స్థానికుల కథనం. ‘ఆ రైతు నాగులచవితి నాడు పుట్టలో నాగేంద్రుడికి పూజించిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను నాగుపాము పొడవడంతో బాలుడు చనిపోయాడు. వ్యవసాయం చేసే రెండు ఎద్దులు కూడా మృతి చెందాయి’ అని.. నాటి నుంచీ ఈ రెండు పండగలను బహిష్కరిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. చిన్నపిల్లలు సైతం ఏ విధమైన టాపాసులు పేల్చకుండా ఉండడం విశేషం. ఈ గ్రామంలో ఉన్నవారందరిదీ నాగుల గోత్రం అయినా నాగుల చవితి చేయకపోవడం గమనార్హం. పున్నాన ఇంటిపేరు గల కుటుంబాలకు కోడళ్లుగా వచ్చినవారు కూడా ఈ పండగలకు దూరంగా ఉంటారు. కాగా పున్నాన కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు మాత్రం.. వివాహం అనంతరం ఇంటి పేరు మారడంతో ఈ రెండు పండగలు చేసుకుంటారు. రెండు దశాబ్దాల కిందట ఈ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు పున్నాన నరసింహుల నాయుడు ఈ పండగలు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.