‘స్వర్ణాంధ్ర - 2047’ సాధనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 12 సూత్రాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా 2047 నాటికి రాష్ట్ర రూపు రేఖలు మార్చేలా ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై బుధవారం సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో పాటుపలువురు అధికారులు పాల్గొన్నారు. ‘వికసిత్ భారత్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని మోదీ వచ్చేనెల ఆవిష్కరించనున్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు, లక్ష్యాలను గుర్తించడంలో భాగంగా బుధవారం నీతి ఆయోగ్ ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చారు. ‘వికసిత్ భారత్-2047’కు సమాంతరంగా ‘స్వర్ణాంధ్ర’ సాధనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై 18 లక్షల మంది ప్రజల నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి ‘విజన్- 2047’లో చేర్చామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని... అందుకే ప్రజారోగ్యానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఏఐ, రోబోటిక్స్ నాలెడ్జ్ సిటీలుగా అమరావతి, తిరుపతి, విశాఖలను తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఇంటికొక ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేసి ప్రజల తలసరి ఆదాయం పెంచామని, ఇప్పుడు అదేబాటలో ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలని విజన్- 2047 డాక్యుమెంట్‌ను రూపొందించామని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనలో సాంకేతికత... ఇలా ఆయా లక్ష్యాలపై నీతి ఆయోగ్ సభ్యులకు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.