కేరళలో విషాదం చోటు చేసుకుంది. శనివారం షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు రైల్వే సిబ్బంది మృతి చెందారు. న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్.. ఢీకొని నలుగురు మృత్యువాత పడ్డారు. షోరనూర్ రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షోరనూర్ బ్రిడ్జి సమీపంలో.. రైల్వే ట్రాక్‌పై ఉన్న చెత్తను తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. అదే సమయంలో కేరళ ఎక్స్‌ప్రెస్ దూసుకురావడంతో అక్కడికక్కడే వారు విగతజీవులుగా పడిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.
వారిలో ఇద్దరు మహిళలు తమిళనాడుకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు పురుషులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 3.05 గంటలకు కార్మికులను ఢీకొట్టినట్లు వారు వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఎక్స్‌ప్రెస్ రైలును పారిశుద్ధ్య కార్మికులు గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని.. రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అదే అని ప్రాథమికంగా తేల్చారు. అయితే ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని షోరనూర్ రైల్వే పోలీస్ అధికారి వెల్లడించారు.
ఇక మొత్తం నలుగురిని రైలు ఢీకొనగా.. అందులో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు మాత్రమే లభ్యం అయ్యాయి. నాలుగో వ్యక్తి మృతదేహం అక్కడే ఉన్న భరతపుజ నదిలో పడిపోగా.. దాన్ని వెలికితీసేందుకు రైల్వే సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా కొందరు దుండగులు.. కావాలనే రైలు ప్రమాదాలు జరిగేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రైలు పట్టాలపై సిలిండర్లు, పేలుడు పదార్థాలు, రాళ్లు, కరెంట్ స్తంభాలు సహా రకరకాల వస్తువులను ఉంచుతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు లోకో పైలట్లు.. పట్టాలపై ఉన్న వస్తువులను గుర్తించి.. రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదాలు తప్పాయి. అయితే ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలా చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.