ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 02, 2024, 11:47 PM

తనవైన విమర్శలతో ఎన్నికల ముందు ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే ప్రధాని నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లను ఆలోచనలో పడేసేలా వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని గందరగోళంలో పడేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పథకాల అమలు, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. తాము ఎన్నటికీ అమలు చేయలేమని తెలిసినా హామీలు ఇస్తారు. కానీ, ఈసారి ప్రజల ముందు ఘోరంగా బయటపడ్డారు’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


‘నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా చూడండి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. బ్యాడ్ నుంచి వరెస్ట్‌కు చేరాయి. వాళ్లు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరలేదు. ఆ రాష్ట్రాల ప్రజలు భయంకరంగా మోసపోయారు. ఇలాంటి రాజకీయాల వల్ల బలయ్యేది సామాన్యులే. పేదలు, యువకులు, రైతులు, మహిళలు ఈ వాగ్దానాల ప్రయోజనాలను పొందలేకపోవడమే కాదు.. వారికి ఇప్పటికే అందుతున్న పథకాలను కూడా నీరుగార్చే దుస్థితి వచ్చింది’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


‘సాధ్యంకాని వాగ్దానాలను చేయడం సులభమే కానీ.. వాటిని అమలు చేయడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రహిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వాళ్లు అసాధ్యమైన హామీలను ఇస్తున్నారు. అసాధ్యమని తెలిసినా వాగ్దానాలు చేస్తున్నారు’ అంటూ ప్రధాని మోదీ రాసుకొచ్చారు. #FakePromisesOfCongress అనే యాష్‌ట్యాగ్‌ను జోడించారు.


వరుసగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రపై కన్నేసింది. ఏక్‌నాథ్ షిండ్ దెబ్బతో మహారాష్ట్రలో కిందటిసారి అనూహ్యంగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కూటమి (మహా వికాస్ అఘాడి)గా ఏర్పడి పోటీ చేస్తోంది. కర్ణాటక, తెలంగాణలో ఓటర్లను ఆకర్షించిన పథకాలనే ప్రధాన అస్త్రాలుగా మలచుకొని ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించాలని భావిస్తోంది.


ఇలాంటి తరుణంలో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి (బీజేపీ కూటమి పేరు) నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ‘పొరుగు రాష్ట్రం తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాది కావొస్తున్నా, వాటిని అమలు చేయలేకపోయింది’ అని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎత్తేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇవన్నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఇలాంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్లు ప్రధాని మోదీ చేసిన విమర్శలు ఆ పార్టీ నేతలను మరింత గందరగోళంలో పడేశాయి. మోదీ వ్యాఖ్యలతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ పైచేయి సాధించినట్లైంది..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com