రాష్ట్ర భవిష్యత్తును మార్చే నూతన ప్రణాళికను రెండు, మూడు రోజుల్లో ఆవిష్కరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్ల వినియోగంపై డ్వాక్రా సంఘాలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శనివారం విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికసిత్ భారత్‌ను దృష్టిలో ఉంచుకొని 2047 నాటికి రాష్ట్రం పూర్తిస్థాయి అభివృద్ధి సాధించడానికి పది అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
అసమానతల తొలగింపు, ఉద్యోగాల సృష్టి-ఉపాధి కల్పన, నైపుణ్యం పెంపుదల, రైతు సాధికారత-ఆదాయం పెంపు, తాగునీటి రక్షణ, ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ ఆంధ్ర, మానవ వనరుల నిర్వహణ-సద్వినియోగం, శక్తి వనరుల వినియోగం- నిర్వహణ, అన్నిరకాల సాంకేతిక జ్ఞానం పెంపు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. గతంలో పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌షి్‌పతో సంపద సృష్టించామని, ఇకపై 4-పీ విధానంతో ముందుకు వెళతామని తెలిపారు. ప్రతి కుబుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారయ్యేలా చేస్తామని, రాష్ట్రాన్ని రతన్ టాటా హబ్‌గా, ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్ రూపొందిస్తామని వివరించారు.