కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరులో తొలి డీఆర్‌సీ సమావేశం సోమవారం సుదీర్ఘంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ దామోదర్, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.
తొలుత మంత్రి స్వామి జిల్లా వెనుకబాటు తనం, అభివృద్ధి చేయాల్సిన వెలిగొండతోపాటు ఇతర పలు అంశాలు, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మొత్తం ఎనిమిది శాఖలకు సంబంధించి పలు విభాగాలను అజెండాలో చేర్చినా సమయం సరిపోక కొన్నింటిపైనే సమీక్ష చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్, ప్రాజెక్టులు, వ్యవసాయం, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేశారు.