ఏపీలో టీడీపీ కూటమి సర్కారు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటికే ఓ సారి నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. ఈ సారి మొత్తం 59 నామినేటెడ్ పదవులకు నియామకాలు జరిగాయి. అధికారంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ.. నామినేటెడ్ పదవులను సైతం పంచుకున్నాయి. 59 నామినేటెడ్ పోస్టులలో టీడీపీకి 46, జనసేనకు 10, బీజేపీకి 3 పదవులు దక్కాయి. జనసేన నుంచి పదిమందికి అవకాశం లభించింది.
అయితే.. జనసేన నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కడం అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే 2019కి ముందు కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు ఇదే కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత నాలుగుసార్లు అక్కడి నుంచి గెలిచిన సుబ్బారాయుడు.. చంద్రబాబు ప్రభుత్వంలో ఓసారి మంత్రిగానూ పనిచేశారు.
అయితే 2009 ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. ఆ ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012లో నర్సాపురంలో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు.. ఆ పార్టీ తరుపున నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటంతో తిరిగి సొంతగూటికి చేరిపోయారు. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కొత్తపల్లి సుబ్బారాయుడిని కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.
అయితే 2019 ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ పార్టీ మారారు. వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో జరిగిన పరిణామాలతో 2022లో వైసీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు.. నర్సాపురం టికెట్ ఆశించారు. అయితే బొమ్మిడి నాయకర్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. తాజాగా జనసేన తరుఫున నామినేటెడ్ పదవి కొత్తపల్లి సుబ్బారాయుడికి దక్కింది. 2019కి ముందు తాను ఛైర్మన్‌గా వ్యవహరించిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి మరోసారి వరించింది.
జనసేనకు దక్కిన నామినేటెడ్ పదవులు
ఏపీ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ - కొత్తపల్లి సుబ్బారాయుడు
ఏపీ తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ - పాలవలస యశస్వి
ఏపీ క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ - వి. సూర్యనారాయణ రాజు
ఏపీ అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ - చిలకలపూడి పాపారావు
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ - చిల్లపల్లి శ్రీనివాసరావు
ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - పెదపూడి విజయ్ కుమార్
అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - టి.సి. వరుణ్
కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - తుమ్మల రామస్వామి
శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - కోరికన రవికుమార్
ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మెన్ (విజయవాడ జోన్) - రెడ్డి అప్పల నాయుడు