రోజురోజుకూ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా.. నేరస్థుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో పోలీసుల తనిఖీలు, సోదాలు, దాడులను సైతం లెక్కచేయకుండా స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే విశాఖపట్నంలో వెలుగుచూసింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు విశాఖ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ.. విశాఖలోకి గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇన్ని జాగ్రత్తల నడుమ కూడా.. ఎలాగోలా స్మగ్రర్లు గంజాయి సాగు, రవాణా సాగిస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా విశాఖపట్నంలోనే గంజాయి సాగు చేస్తున్న వైనం కలకలం రేపింది.
విశాఖపట్నంలో గంజాయి సాగు చేయడం కలకలం రేపింది. వైజాగ్‌లోని కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న వైనం బయటపడింది.గంజాయి మత్తుకు అలవాటుపడిన కొంతమంది యువకులు.. గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ గంజాయి పంట పండిస్తున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఇదే యవ్వారం జరుగుతున్నట్లు సమాచారం. అయితే పక్కా సమాచారంతో పోలీసులు ఈ గుట్టును రట్టుచేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా దాడి చేసిన విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు.. గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ పండించే గంజాయిని విశాఖపట్నంలోని కాలేజీ విద్యార్థులకు కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
మొత్తం ఐదు మంది యువకులు ఈ గంజాయిని సాగుచేస్తున్నట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. ఏజెన్సీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుమందిలో ఒక మైనర్ ఉండగా.. మిగతా నలుగురు కూడా మైనర్లు కావటం పోలీసులను షాక్‌కు గురిచేసింది. నిందితుల్లో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారి నుంచి గంజాయిని ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో వీరే ఉన్నారా.. లేక ఇంకా వేరే వ్యక్తుల పాత్ర ఏమైనా ఉందా అనేదానిపైనా ఆరా తీస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలు కావద్దని.. ఇలా అక్రమంగా సాగు, రవాణా చేస్తే జీవితాలు నాశనమవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.