ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మెట్రో ప్రాజెక్టులకు మళ్లీ ఊపిరొచ్చింది. గతంలో విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడంతో.. ఆ ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో విజయవాడ, విశాఖ మెట్రో ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ మెట్రోకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం.. విజయవాడ మెట్రో పనులను కూడా తిరిగి పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మెట్రో ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపారు.
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విజయవాడ మెట్రో ప్రాజెక్టు తొలి దశపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు తొలిదశలో రెండు కారిడార్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి దశలో 38.40 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్ వరకు 26 కిలోమీటర్ల మేరకు మొదటి కారిడార్, పీఎన్‌బీఎస్ నుంచి పెనమలూరు వరకూ 12.5 కిలోమీటర్ల మేరకు రెండో కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. మొత్తం 21 స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ మొదటి దశలో నిర్మించాలని ప్రతిపాదించారు. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి 25 కోట్లు చొప్పున విజయవాడ మెట్రో తొలిదశ నిర్మాణం కోసం 11 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇక విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండో దశలో..27.80 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మా్ణం జరగనుంది. ఇందుకోసం రూ.14,121 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండోదశలో పీఎన్బీఎస్ నుంచి అమరావతికి 27.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించాలని ప్రతిపాదించారు. 15 కిలోమీటర్లు భూగర్భంలో, 5 కిలోమీటర్లు ఆకాశంలో ఉండేలా ప్రతిపాదనలు చేశారు. ఈ రెండోదశలో మొత్తం 32 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు చేశారు.
అలాగే జక్కంపూడి వరకు ఉన్న కారిడార్‌ను.. 16 కిలోమీటర్ల మేర వలయ రూపంలో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే తాజా ప్రతిపాదనల్లో జక్కంపూడి కారిడార్ మినహాయించినట్లు తెలిసింది. మొత్తంగా విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండు దశలు కలిపి 60 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు చేశారు. అలాగే విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండు దశలు కలిపి రూ.25,130 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.