పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఈ నెల 5న చెన్నై నుంచి వచ్చారు. గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాములు, ఆయన అనుచరుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శివార్లలో ఉన్న జీవీఆర్ ఆక్వా సంస్థలోనూ సోదాలు చేపట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పటికే పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత బుధవారం గ్రంధి శ్రీనివాస్ హైదరాబాద్ వెళుతుండగా, మార్గమధ్యంలోనే ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఆయన ప్రయాణాన్ని విరమించుకుని, భీమవరం తిరిగొచ్చారు. గత ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆయన వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రంధిపై పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏకంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పవన్ పై ఒంటికాలి మీద ధ్వజమెత్తిన వారిలో గ్రంధి శ్రీనివాస్ కూడా ఉన్నారు. పవన్ కు పలుమార్లు సవాళ్లు కూడా విసిరారు. 2019 ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా... భీమవరంలో ఓడిపోయింది గ్రంధి శ్రీనివాస్ చేతిలోనే.