ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ మరోసారి చెలరేగాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా వెస్టిండీస్- ఇంగ్లండ్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో 54 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. 9 ఫోర్లు, 6 సిక్సర్లతో వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫిల్ సాల్ట్ సంచలన ఇన్నింగ్స్‌తో 183 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో ఛేదించింది.ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న ఫిల్ సాల్ట్... టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ అందుకోని రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో ఒకే జట్టుపై మూడు శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతేడాది ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో ఫిల్ సాల్ట్ వరుసగా రెండు శతకాలు బాదాడు. నిన్న (శనివారం) మరో సెంచరీ నమోదు చేయడంతో వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు కాగా కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 స్కోర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఫిల్ సాల్ట్ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్ సునాయసంగా విజయాన్ని సాధించింది.