ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు గుంటూరులో పర్యటించారు. గుంటూరు అరణ్య భవన్ లో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అటవీ అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. విధినిర్వహణలో 23 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వారిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. అటవీ శాఖల బ్లాక్ లకు అమరుల పేర్లు పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. అటవీ శాఖకు సంపూర్ణ మద్దతు అందిస్తామని చెప్పారు. తాను అటవీశాఖ తీసుకోవడానికి... అమరవీరుడు పందిళ్లపల్లి శ్రీనివాస్ స్ఫూర్తి అని వెల్లడించారు. అటవీశాఖ కోసం రూ.5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానని పేర్కొన్నారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని తెలిపారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పవన్ పలు రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు. "మాది మంచి ప్రభుత్వమే కానీ, మెతక ప్రభుత్వం కాదు. ఐపీఎస్ అధికారులను బెదిరించాలని చూస్తే సుమోటోగా కేసులు పెడతాం. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం. గతంలో అధికారులను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం" అని పవన్ కల్యాణ్ వివరించారు.