ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా నామినేటెడ్ పదవులు పొందినవారికి చంద్రబాబు శుభాకాంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2024, 06:17 PM

ఏపీలోని కూటమి ప్రభుత్వం రెండో విడత నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 చైర్మన్ పోస్టులు, ఒక వైస్ చైర్మన్ పోస్టు భర్తీ చేసిన ప్రభుత్వం... రెండో లిస్టులో ఏకంగా 62 మందికి చైర్మన్ పదవులు, సలహాదారు పదవులు కట్టబెట్టింది. సుదీర్ఘ కసరత్తు తరువాత... పదవుల కోసం వచ్చిన 30 వేల దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నేతలను వివిధ పోస్టులకు ఎంపిక చేశారు. వీటిలో 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కాగా... క్యాబినెట్ హోదాతో రెండు సలహాదారు పోస్టులు ఉన్నాయి. పదవులు పొందిన అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపి... వారికి అభినందనలు తెలియజేశారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని సూచించారు. “పదవుల ఎంపికపై సుదీర్ఘమైన, పటిష్టమైన కసరత్తు చేశాము. ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. అయితే కష్టపడిన వారికి న్యాయం చేయాలనే అంశం ప్రాతిపదికగా ముందుగా మిమ్మల్ని ఎంపిక చేశాము. పార్టీ కోసం మీ పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల్లో సరైన వ్యక్తికి సరైన చోట టిక్కెట్ అనే విషయంలో అనుసరించిన విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. స్వయంగా ప్రజల నుంచి మీ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు అని ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుని... ప్రజామోదం ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చాము. ప్రజలు ఆ విధానాన్ని స్వాగతించారు. అందుకే చరిత్రలో లేని విధంగా 93 శాతం స్ట్రైక్ రేట్ తో, 57 శాతం ఓట్ షేర్ తో కూటమికి పట్టం కట్టారు. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అదే సూత్రాన్ని అవలంబించాం. ముఖ్యంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. గత ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొని 5 ఏళ్లు ధైర్యంగా నిలబడిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. కేసులు, దాడులు, వేధింపులకు గురైన వారిని గుర్తుపెట్టుకుని గౌరవించాం. ఎన్ని సవాళ్లు వచ్చినా నిలబడి పోరాటం చేసిన వారికి, మహిళలు, యువతకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాం. బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చే ఏకైక పార్టీగా మన తెలుగుదేశం నిలుస్తుంది. చాలా మంది బూత్ ఇంచార్జ్‌లు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, గ్రామ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చాము. రానున్న రోజుల్లోనూ మరిన్ని పదవులు ఇస్తాము. గత 5 ఏళ్లు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, మెంబర్ షిప్ కార్యక్రమంలో, పార్టీ నిర్దేశించిన ఇతర లక్ష్యాలను చేరుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నవారికీ పదవి లభిస్తుందనేది నేటి ఈ పోస్టుల ద్వారా మరోసారి అందరికీ అర్ధం అయ్యింది. మీకు పదవులు వచ్చాయి. మీతో పాటు ఇంకా చాలా మంది పార్టీ కోసం శ్రమించారు. పనిచేసిన వారికి న్యాయం చేసే క్రమంలో జరిగిన తొలి ఎంపికల్లో మీరు అవకాశం పొందారు. రానున్న రోజుల్లో ఇతరులకు కూడా తగిన విధంగా అవకాశాలు కల్పించి, గౌరవిస్తాం. ఇంకా చాలా మందికి ఆయా కార్పొరేషన్ ల డైరెక్టర్లుగా, ఇతర పదవులు ఇస్తాం” అని ముఖ్యమంత్రి అన్నారు. పదవులు వచ్చిన నాయకులు, యువత రెండేళ్ల పదవీ కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రజల కోసం నిజాయితీగా, కష్టపడి పనిచేయడం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చంద్రబాబునాయుడు అన్నారు. సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే మన నినాదాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయాలని పదవులు పొందిన వారికి సీఎం సూచించారు. పదవులు వచ్చిన వారు ప్రజలతో మరింత సౌమ్యంగా, గౌరవంగా ఉండాలని... ఎక్కడా పదవీ అహంకారం, హడావుడి అనేది కనిపించకూడదని... అప్పుడే ప్రభుత్వంతో పాటు మీకూ మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com