సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ అదుపులోకి తీసుకున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ గురించి రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయనను అరెస్ట్ చేశారని.. బయట పెట్టడం లేదంటూ వైసీపీ, వర్రా రవీందర్ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వర్రా రవీందర్‌రెడ్డితో పాటుగా సుబ్బారెడ్డి, ఉదయ్ అనే మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"సోషల్ మీడియా పోస్టులలో నిందితులు వాడిన భాష చూస్తే అరబ్ దేశాల్లో అయితే చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష విధిస్తారు. అంత అసహ్యకరమైన భాష వాడారు. వర్రా రవీందర్‌రెడ్డి అయితే రాష్ట్రంలోని ముఖ్య నేతల ఇళ్లల్లోని మహిళలే లక్ష్యంగా చేసుకుని పనిచేశాడు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కుటుంబాల్లోని మహిళల మీద సోషల్ మీడియాలో ఇలా వికృత పనులు చేశారు. అయితే ఇదంతా ఈయన వ్యక్తిగతంగా చేసింది కాదు. ఇది ఆర్గనైజ్‌డ్ క్రైమ్. వర్రా రవీందర్‌రెడ్డిని ఆదివారం మార్కాపురం సమయంలో రాత్రి 11 గంటలకు అదుపులోకి తీసుకున్నాం. వర్రా రవీందర్ రెడ్డి గతంలో భారతీ సిమెంట్స్‌లో ఉద్యోగం చేశారు. అప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. 2019 నుంచి ఉద్యోగం మానేసి పూర్తిస్థాయిలో వైసీపీ సోషల్ మీడియా వింగ్‌లో పనిచేస్తున్నారు" అంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు.
నిందితులు న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టారన్న కర్నూలు రేంజ్ డీఐజీ.. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇలాంటి వారిని 45 మందిని గుర్తించామని వెల్లడించారు. ముఖ్యనేతల ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసేవారన్న పోలీసులు.. వీరికి 40 యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని.. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి వీటిని నడిపించారంటూ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించాల్సి ఉందన్న కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్.. నిందితులు వాడిన భాష చదవలేని విధంగా ఉందంటూ అభిప్రాయపడ్డారు. సభ్య సమాజం అసహ్యించుకునేలా వారి పోస్టులు ఉన్నాయని.. మహిళలపై ఇలాంటి పోస్టులు చేసేవారిని రాక్షస జాతిగా భావించవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.