ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్‌లను ప్రోత్సహిస్తోంది .. పోలీస్‌శాఖ నుంచి వ్యవసాయం వరకు డ్రోన్‌ల ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీస్ అధికారులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.. తాజాగా డ్రోన్ సాయంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రిమినల్స్ ఆట కట్టించారు పోలీసులు. గుట్టుగా గంజాయిని సాగు చేస్తుండగా.. డ్రోన్ ద్వారా ఆ ప్రాంతాన్ని కనిపెట్టి ధ్వంసం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్.. సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేశారు. డ్రోన్‌ను ఆకాశంలోకి ఎగరవేయగా.. గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గ్రామ పరిసరాల్లో 5 ఎకరాల్లో సాగు చేస్తున్న 1,000 గంజాయి మొక్కలను డ్రోన్ సాయంతో గుర్తించి ధ్వంసం చేశారు. ఆ ఏరియాలో గంజాయిని సాగు చేస్తున్నవారి వివరాలు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఇకపై నిరంతర నిఘా ఉంటుంది అన్నారు. డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతంలో గంజాయి సాగుపై మరింత నిఘా పెంచుతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దుతో పాటుగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నారు.
మరోవైపు అనకాపల్లి జిల్లాలో కణుజు మాంసం కలకలం రేపింది. పందూరు శివారు బంద ప్రాంతానికి చెందిన అప్పారావు కణుజు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ గార్డు ఆ ఊరికి వెళ్లి అప్పారావు ఇంట్లో తనిఖీ చేశారు. అక్కడ ఫ్రిజ్‌లో కవర్లలో మాంసం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 9 కేజీలు కణుజు మాంసాన్ని స్వాధీనం చేసుకుని అప్పారావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మాంసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు అటవీశాఖ అధికారులు.