ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరులో అరుదైన శాసనం లభించింది. మార్టూరు గ్రామంలోని పాత శివాలయం వద్ద ఉన్న కాలువలో ఈ శాసనం లభించింది. ఈ విషయాన్ని ఆర్కియాలజిస్ట్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి వెల్లడించారు. వారసత్వ సంపద సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వీరు బాపట్ల జిల్లా మార్టూరులో పర్యటించారు. ఈ సందర్భంగా శివాలయం వద్ద ఉన్న కాలువలో 15వ శతాబ్దం నాటి శాసనాన్ని గుర్తించారు. తెలుగులో ఉన్న ఈ శాసనం క్రీస్తు శకం 1453 కాలం నాటిదిగా ఆర్కియాలజిస్టులు గుర్తించారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మల్లికార్జున దేవరాయలు ఈ శాసనాన్ని జారీ చేసినట్లు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వెల్లడించారు. శివాలయం లోపల ఉన్న శాసనం కొన్ని దశాబ్దాల క్రితం పునరుద్ధరణ సమయంలో బయట పడినట్లు తెలిసింది.
మరోవైపు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ విజయనగర శాసనాన్ని పరిరక్షించాలని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్రీస్తు శకం 1453 కాలం నాటిదైన ఈ శాసనంలో విజయనగర చక్రవర్తి మల్లికార్జున రాయలు.. దేవాలయ నిర్వహణకు చేసిన సహాయం వివరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మార్టూరు గ్రామ చరిత్రకు సంబంధించిన విషయాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇంతటి చరిత్ర కలిగిన పురాతన శాసనాన్ని భద్రపరచాలని కోరుతున్నారు. ఈ శాసనాన్ని పాత శివాలయం ఆవరణలో భద్రపరచాలని.. అలాగే ప్రజలకు తెలిసేలా ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు బాపట్ల ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం నుంచి వివిధ రాజవంశాలు పాలిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా కాలాల్లో వేసిన శాసనాలు అప్పుడప్పుడూ బయటపడుతూ వస్తున్నాయి. బాపట్ల ప్రాంతాన్ని విజయనగరాజులతో పాటుగా చోళులు, పల్లవులు, గజపతులు, కాకతీయులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఏలినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక శాసనాలు బయల్పడ్డాయి. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని వివిధ చోట్ల బయటపడిన శాసనాలను, వస్తువులను భవిష్యత్తు తరాలకు తెలిసేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మ్యూజియం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత చరిత్ర పరిరక్షణతో పాటుగా భావి తరాలు తెలుస్తుందని చెబుతున్నారు.