సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి జీవి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు రూపాయి రూపాయి పోగుచేస్తూ కష్టపడుతుంటారు. అయితే ఏపీలో సొంత ఇల్లు లేనివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సోమవారం ప్రవేశపెట్టిన 2024-24 ఏపీ బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల ఇళ్లు/ పట్టాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం పేరును కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన- ఎన్టీఆర్ నగర్ పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది.
మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన- ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లతో పాటుగా అదనంగా 16 లక్షల మందికి ఇళ్లు లేదా పట్టాలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో వదిలేసిన సుమారు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పీఎం ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద 1.79 లక్షల ఇళ్లను, ప్రధానమంత్రి జన్‌మన్ కింద మంజూరైన 15 వేల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణానికి రూ.4,012 కోట్లు కేటాయించారు.
మరోవైపు ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని.. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి తరుఫన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గృహనిర్మాణశాఖపై పలుసార్లు సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అలాగే ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. బడ్జెట్‌లో ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు మధ్యతరగతి జీవిలో సొంతింటి ఆశలు మొదలయ్యాయి.