వయనాడ్ పార్లమెంట్ ఉప-ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీచేసిన మొదటిసారే రాజీవ్ తనయ అద్భుత విజయాన్ని అందుకుని.. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వయనాడ్ ప్రజలు ప్రియాంకను అక్కున చేర్చుకుని.. మంచి మెజార్టీని కట్టబెట్టారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీ 3.64 లక్షల ఓట్ల రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు. అలాగే, 2019 ఎన్నికల్లో రాహుల్ మెజార్టీ 4.03 లక్షలను దాటేసి.. సీపీఎం సత్యన్ మోకెరీపై 4.08 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ప్రియాంక విజయానికి అనేక అంశాలు అనుకూలించాయి. ముఖ్యంగా తన ప్రచార శైలితో వయనాడ్ ప్రజలను ఆకట్టుకున్నారు. ‘తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకపోయినా... గత 20 ఏళ్లుగా పార్టీ నాయకుల కోసం ప్రచారం చేశానని, ఇప్పుడు నా కోసం తొలిసారి మీ ముందుకు వచ్చాను.. 30 ఏళ్లుగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. ఇప్పుడు మీ సమస్యలపైనా అలాగే పోరాటం చేసి మీ తరఫున బలమైన గొంతుకనవుతా..’ అంటూ ప్రచారంలో చెప్పిన ఈ మాటలే వయనాడ్ ఓటర్లను ఆలోచింపజేశాయి.
రెండు దశాబ్దాల కిందట గాంధీ-నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాల పరిచయమైన ప్రియాంక.. అచ్చం తన నానమ్మ ఇందిరను తలపిస్తారు. 2004 ఎన్నికల సమయంలో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే, ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి 2019 జనవరిలోనే ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
తన కుమార్తె ప్రియాంక గాంధీ గురించి రాజీవ్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో ‘మా అమ్మలాగే నా కుమార్తె కూడా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి’ అని చెప్పారు. ఆయన మాటలను నిజం చేస్తూ ఆహార్యం, ఆచరణలోనూ ప్రియాంక ఎక్కువగా నానమ్మ ఇందిరా గాంధీలా ఉండటానికే ఇష్టపడతారు. పోలికలూ, ఆహార్యం, వాగ్ధాటిలోనూ ఆమె ఇందిర వారసురాలే అని నిరూపించుకున్నారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టిన ప్రియాంక.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ప్రియాంక ప్రచారం అందర్నీ ఆకట్టుకుంది.