ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అరెస్ట్ చేస్తారా..?

international |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 10:50 PM

ఇజ్రాయెల్, హెజ్బొల్లా యుద్ధంలో వేలాది మంది సామాన్యులు సమిధలవ్వడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లంట్‌‌కు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న దాడుల్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని, మానవత్వం లేకుండా నేరాలు చేశారని నెతన్యాహు, గల్లంట్‌లపై ఐసీసీ అభియోగాలు మోపింది. ఈ వివాదంపై నెలల పాటు విచారణ జరిపిన తర్వాత నవంబర్ 20న ఈ వారెంట్స్‌ను ఐసీసీ జారీ చేసింది. అయితే, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును అరెస్టు చేయడం సాధ్యమేనా..?


నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో 2002లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధ నేరాలు, నరమేధం, మానవత్వంపై దాడులు, చట్ట వ్యతిరేక నేరాలకు సంబంధించి 32 కేసులను ఐసీసీ విచారించింది. వీటిలో 14 కేసులు ఇప్పటికీ ఇంకా తేలలేదు. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవారిని పట్టుకోలేకపోవడం. ఎందుకంటే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఇప్పటికీ సొంత పోలీస్ ఫోర్స్ లేదు. నేరాలు జరిగిన దేశాల్లోని పోలీసులను వాడుకోవడం తప్ప సొంతంగా అరెస్టులు చేయడానికి వీలుపడదు.


2002 నుంచి ఇప్పటి వరకు మొత్తం 56 అరెస్ట్ వారెంట్లను ఐసీసీ జారీ చేసింది. వీటిలో 21 అరెస్టు వారెంట్లు మాత్రమే నిందితులకు చేరాయి. చాలా దేశాల నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి మద్దతు లభించడం లేదు. మరీ ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఐసీసీకి అస్సలు సహకరించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెతన్యాహు, గల్లంట్‌‌ను ఐసీసీ అరెస్ట్ చేయగలదా అంటే.. అనుమానమే.


ఈ దేశాల్లో నెతన్యాహును అరెస్ట్ చేయొచ్చు


ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత నిందితులను అరెస్ట్ చేయడానికి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం సభ్యత్వ దేశాలు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును స్థాపించిన ఒప్పందం ‘రోమ్ శాసనం’లో భాగమైన ఏ దేశంలో అయినా నిందితులు అడుగుపెడితే అక్కడి పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. నెతన్యాహుని ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయలేకపోవచ్చు.. కానీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యత్వం ఉన్న ఏ దేశంలోనైనా ఆయన అడుగుపెడితే చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దేశంలోనే అరెస్ట్ చేసే అవకాశమూ ఉంటుంది.


ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో 124 దేశాలకు సభ్యత్వం ఉంది. వీటిలో యూరప్ మొదలుకొని ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల్లో ఈ దేశాలు విస్తరించి ఉన్నాయి. ఈ సభ్యత్వ దేశాల్లో భారత్ లేదు. అయితే, ఐసీసీలో సభ్యత్వం కలిగి ఉన్న ఏ దేశంలోనూ నెతన్యాహు అడుగుపెట్టకుండా ఉండేందుకు ఆయనకి అరెస్ట్ వారెంట్ ఉపయోగపడుతుందని మరిచిపోకూడదు. అంతేకాకుండా.. అరెస్ట్ చేస్తారని తెలిసి, తెలిసి ఆయా దేశాలకు నెతన్యాహు వెళ్లరు కదా!


ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ట్విస్ట్.. నెతన్యాహు అరెస్ట్ సాధ్యమేనా?


పక్కా ఆధారాలతోనే..


నెతన్యాహు, గల్లంట్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీవ్ర ఆరోపణలు చేసింది. గాజాలో వీరు చేసిన నేరాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. ఈ ఏడాది మే నెల వరకు సేకరించిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ జరిపింది. యుద్ధంలో ఇజ్రాయెల్ మానవత్వానికి స్థానం ఇవ్వకుండా.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే దాడులకు పాల్పడినట్టు తేల్చింది.


ఆకలితో ఆటలు


గతేడాది అక్టోబర్ 8 నుంచి గాజాలోని ప్రజలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు, మందులు, ఇంధనం, విద్యుత్ వంటి కనీస అవసరాలు గాజాలోని ప్రజలకు అందకుండా నెతన్యాహు, గల్లంట్ ఆంక్షలు విధించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేతలిద్దరూ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న ఈ చర్యల వల్ల గాజాలోని ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడిందని.. దీని కారణంగా ఎంతో మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కోర్టు పేర్కొంది.


నెతన్యాహు, గల్లంట్ మానవత్వంపై దాడికి పాల్పడ్డారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వారు ఏవిధంగా మానవత్వాన్ని చంపేశారు అనడానికి ఉదాహరణగా కొన్ని విషయాలను వెల్లడించింది. ఈ ఇద్దరు నేతలు తీసుకున్న నిర్ణయాల వల్ల గాజాలోని పిల్లలు పోషకాహార లోపంతో డీహైడ్రేషన్‌కు గురై మరణించారని కోర్టు పేర్కొంది. గాజాలో గాయపడినవారికి సరైన చికిత్స అందనివ్వకుండా కూడా నెతన్యాహు, గల్లంట్ ప్రవర్తించారని కోర్టు ఆరోపించింది. సరిపడా మందులు అక్కడి ఆసుపత్రుల్లో లేకుండా చేశారని పేర్కొంది. గాయపడిన చాలా మందికి అనస్తేషియా ఇవ్వకుండానే ఆపరేషన్లు చేశారని.. ఆ నొప్పిని భరించలేక ప్రజలు నరకం చూశారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.


గాజాలోని సామాన్య ప్రజలపై కూడా దాడి చేయమని ఇజ్రాయెల్ మిలటరీకి స్వయంగా నెతన్యాహు, గల్లంట్ సూచనలు ఇచ్చారని.. అంతర్జాతీయ మానవతావాద చట్టాన్ని వీరిద్దరూ కాలరాశారని కోర్టు మండిపడింది. దురుద్దేశంతోనే మిలటరీతో ఈ దాడులు చేయించారని ఆరోపించింది. ఇజ్రాయెల్ నేతలిద్దరూ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అసత్యాలని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. తమ దేశ భద్రత దృష్ట్యా అవసరం కాబట్టే గాజాపై ఇజ్రాయెల్ మిలటరీ దాడులు చేసిందని పేర్కొంది. ఆత్మరక్షణలో భాగంగానే తాము దాడులు చేశామని గల్లంట్ చెబుతుండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa