మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించని రీతిలో భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరుఫున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లాతూర్, షోలాపూర్ సహా పలుచోట్ల మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. బహిరంగసభలతో పాటుగా ర్యాలీలలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇంత జరిగినా కూడా జాతీయ మీడియా పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవడం లేదని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
"జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత గురించి ఎక్కడా చెప్పడం లేదు. మహారాష్ట్రలో చారిత్రక విజయానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా కారణమో.. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ ఓ కారణం. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఇంత ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. అందరూ 150 వరకూ అంచనా వేశారు. కానీ అక్కడ అద్భుతం జరిగింది. ఆ అద్భుతానికి కారణం ఎవరని జాతీయ మీడియా ఎందుకు ఆలోచించడం లేదు?" అంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు.
"జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి కూడా ఎందుకు సంకోచిస్తోంది? దీని వెనుక ఏమైనా విదేశీ హస్తం ఉందా? నాకు అనుమానం వస్తోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని చాలా దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. సోషల్ మీడియా లేకపోతే మహారాష్ట్రలో ఈ ప్రభంజనం వచ్చేది కాదు. లాతూర్, షోలాపూర్‌లలో జరిగిన పవన్ కళ్యాణ్ ర్యాలీలను యూట్యూబ్‌లలో పెట్టారు. ఈ వీడియోలు చూసి, అక్కడకు వచ్చిన జనాలను చూసే ఈ ప్రభంజనం వచ్చింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్‌కు బ్రహ్మరథం పట్టడాన్ని అక్కడి సోషల్ మీడియా ప్రజలకు చూపించింది. అందుకే ఈ ప్రభంజనం. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికైనా మీడియా చూపించాలి." అని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
మరోవైపు జాతీయ మీడియా, జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలను అంచనా వేసే సెఫాలజిస్టుల అంచనాలు ఎందుకు తప్పాయన్న బొలిశెట్టి సత్యనారాయణ.. వీళ్ళ వెనుక ఉన్న విదేశీ హస్తమా లేదా దేశంలో పవన్ కళ్యాణ్ ప్రభావం గురించి తెలియదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం బహిరంగంగానే పవన్ అంటే గాలి కాదు పెను తుఫాన్ అని చెప్పారన్న బొలిశెట్టి సత్యనారాయణ.. పవన్ కళ్యాణ్ శక్తిని తక్కువ అంచనా వేసినవారు ఇప్పటికైనా తమ అభిప్రాయాలను మార్చుకోవాలని సూచించారు.