ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. టూరిజం వల్ల అనేక దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు పవన్ తెలిపారు. వారసత్వ ప్రాంతాలను గుర్తించి, కాపాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై పవన్ కల్యాణ్ సమీక్షించారు. దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.ఆలయాల పవిత్రతను కాపాడేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆలయాలు, పర్యావరణం, క్రీడా రంగాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. పర్యాటక రంగాన్ని సీఎం మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తామని.. అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.